High Court Telangana : రాచరికపు పోకడల్లేని భవనం.. సరికొత్తగా తెలంగాణ హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సంయుక్తంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ హైకోర్టు బిల్డింగ్ రూపురేఖలు దాదాపు జార్ఖండ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాదిరిగా ఉండనున్నాయి. ఈ మేరకు హైకోర్టు జడ్జిల కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్అండ్‌బీ ఉన్నతాధికారులు, సంబంధిత కన్సల్టెన్సీ, ఆర్కిటెక్స్ట్ ఫైనల్ చేసినట్టు తెలిసింది. అయితే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలతో పాటు దేశంలో ఇదివరకే చారిత్రాత్మకంగా నెలకొన్న కోర్టులనూ పరిశీలించిన కమిటీ సభ్యులు తాజాగా నిర్మించిన హైకోర్టుల నుంచే డిజైన్‌లను తీసుకోవాలని నిర్ణయించింది. జార్ఖండ్ మోడల్ డిజైన్‌ను లోతుగా పరిశీలించిన కమిటీ, ప్రభుత్వం దానిలోని చాలా అంశాలతో ఏకీభవించినట్ట తెలిసింది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల మేరకు నిర్మాణాలు చేపట్టాలని న్యాయమూర్తులు సూచించగా… ప్రభుత్వం కూడా అందుకు సమ్మతంగానే ఉన్నది.
హైకోర్టు డిజైన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక నియమిత కన్సల్టెన్సీ చూసుకుంటున్నట్టు బిల్డింగ్ వింగ్ కి చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం లా మినిస్ట్రీ బడ్జెట్ నుంచి జరుగుతుందని ఆర్అండ్‌బీ శాఖ మానిటరింగ్‌లో సాగుతుందని వెల్లడిస్తున్నారు. అయితే, ఈ విషయం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆర్అండ్ బీ అధికారవర్గాలు వివరిస్తున్నాయి. ఆ తర్వాతే నిర్మాణపు పనులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రకటన ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. అందుచేత, ఫైనల్ అయిన కొత్త హైకోర్టు డిజైన్ ను బహిర్గతం చేసేందుకు అధికారులు జంకుతున్నారు. ఈ విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు.
భవనంలో రాజరిక పోకడలుండవు
హైదరాబాద్ నగరంలో ప్రస్తుత హైకోర్టు నిజాం పాలన సమయంలో నిర్మించిందని…అందుచేత, దాంట్లో కొంత రాజరిక లక్షణాలు కనిపిస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ, కొత్త హైకోర్టు పూర్తిగా ప్రజాస్వామిక దృక్పథం ప్రస్పుటించే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిసింది. అయితే, భవన నిర్మాణం జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 60 కోర్టు హాల్స్ అవసరం అని జడ్జిల కమిటీ, ఆర్అండ్ బీ అధికారులు, కన్సల్టెన్సీ నిర్వాహకులు గుర్తించగా… ప్రస్తుతం 43 మాత్రమే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
రాజేంద్రనగర్లో నిర్మాణం..
రాష్ట్ర న్యాయ అవసరాల నిమిత్తం…. ప్రభుత్వం తీసుకున్న హైకోర్టు నిర్మాణం… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ మండలంలోని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వద్ద కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నూతన హైకోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. హైకోర్టు భవనంలో జడ్జిలకు నివాస భవనాలు, బార్ కౌన్సిల్ ఆఫీసు, అడ్వకేట్లకు లైబ్రరీ, పోలీసు, సెక్యూరిటీ సిబ్బిందితో పాటు మొత్తం 40 బిల్డింగులు నిర్మించేందుకు అన్ని పరిశీలనల తర్వాత డిజైన్లను ఈ ఫైనల్ డిజైనులో ఖరారు చేశారు. హైకోర్టు నూతన భవనం నిర్మాణ డిజైన్లను అందించేందుకు 19 ఆర్కిటెక్ట్ కంపెనీలు ముందుకు రాగా ఒక్కదాన్ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.