ఖరీఫ్ సీజన్‌లో కాంగ్రెస్ సర్కార్ ముందు పెద్ద సవాల్

ఈసారి ఖరీఫ్ సీజన్‌కు రైతుల నుంచి కొనుగోలు చేసే వడ్లను కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.

Update: 2024-10-07 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి ఖరీఫ్ సీజన్‌కు రైతుల నుంచి కొనుగోలు చేసే వడ్లను కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. గత సర్కారు హయాంలో చేసిన కేటాయింపులకు అనుగుణంగా బియ్యం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు రాకపోవడంతో కొన్ని బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం పలుమార్లు నోటీసులు పంపినా సానుకూల స్పందన రాకపోవడంతో కొన్ని మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాల్సి వచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో మిల్లులకు తాత్కాలికంగా రిలీఫ్ లభించింది. ఈ నేపథ్యంలో ఈసారి వడ్లను బియ్యంగా మార్చడానికి రైస్ మిల్లులకు కేటాయించడానికి కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. ఆయా మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా మొత్తం కేటాయింపులో 25 % మేర బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం తీసుకుంటున్నది. దీంతో మిల్లులు వాటి ఆస్తులను గ్యారంటీగా చూపి బ్యాంకు నుంచి ప్రభుత్వానికి జమ చేయాల్సి వస్తున్నది.

తెలంగాణ విధానంపై రైస్ మిల్లర్ల అసంతృప్తి

తెలంగాణ విధానంపై రైస్ మిల్లుల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కో క్వింటాల్‌కు (బియ్యంగా మార్చినందుకు) రూ.120 ఇస్తున్నదని, 100 % బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నదని రాష్ట్ర రైస్ మిల్లుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.110, మహారాష్ట్ర రూ.70 చొప్పున కమీషన్ చార్జిలు ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం క్వింటాల్‌కు కేవలం రూ.10 ఇస్తూ, 25 % బ్యాంకు గ్యారంటీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిల్లింగ్ సామర్థ్యానికి మించి కేటాయింపులు చేయడంతో డెలివరీలో జాప్యం జరిగిందని, వర్షాలతో ఆ బియ్యం తడిచిపోయాయని వెల్లడించారు. ఈసారి కేటాయించినా తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని, బ్యాంకు గ్యారంటీ అంశం ఒకటైతే, కమీషన్ గిట్టుబాటు కాదని మిల్లుల సంఘం ప్రతినిధి వెల్లడించారు.

మిల్లింగ్ విషయంలో కఠినంగా కార్పొరేషన్

గత ప్రభుత్వ నిర్ణయాలతో సగటున ఒక్కో రైస్ మిల్లు రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు బాకీ పడిందని, వాటిని వసూలు చేసుకోవడంతో పాటు ఈసారి మిల్లింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కార్పొరేషన్ భావిస్తున్నది. ఒక్కో క్వింటాల్‌కు సేకరణ ధరను రూ.2,320 (గ్రేడ్-ఏ)గా ప్రభుత్వం ఫిక్స్ చేయడంతో ఇందులో 25 % బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి వస్తున్నది. ఈసారి సీజన్‌కు సుమారు 1.40 కోట్ల టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేసిన కార్పొరేషన్..అందులో దాదాపు 70 లక్షల టన్నులు నేరుగా రైస్ మిల్లర్లకు, బయ్యర్లకు విక్రయానికి పోతాయని, కొంత రైతుల తిండి అవసరాలకు, విత్తనాల కోసం పోతాయని, చివరకు 80 లక్షల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసింది. ఈ 80 లక్షల టన్నుల్లో దాదాపు 35 లక్షల టన్నులు దొడ్డు రకాలవి ఉంటాయని, మిగిలినవి సన్నాలనేనని పేర్కొన్నది. గతంతో పోలిస్తే ఈసారి 31 రకాల సన్నాలు (ఫైన్ వెరైటీ రైస్) సాగు చేసినందున మిల్లింగ్‌ ప్రాసెస్‌లో ఎన్ని కిలోల బియ్యం వస్తాయన్నది ఖరారు కావాల్సి ఉన్నదని రైస్ మిల్లు యజమాని ఒకరు తెలిపారు.

బ్లెండింగ్, సోర్టెక్స్ మెషినరీని సమకూర్చుకోవాలని మిల్లర్లకు సూచన

కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ప్రతి క్వింటాల్ సన్న వడ్లకు 67 కిలోల చొప్పున బియ్యం చేసి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ కొత్త వెరైటీలలో నూక శాతం ఎంత వస్తుందో తెలియకుండా 67 కిలోల నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడంపై ఇప్పుడే స్పష్టతకు రాలేమని తెలిపారు. దీన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకుని ‘ఔట్ టర్న్’ (క్వింటాల్ వడ్లకు వచ్చే బియ్యం క్వాంటిటీ) లెక్కలపై టెస్టింగ్ చేయాలని కార్పొరేషన్ కమిషనర్‌కు మిల్లర్లు సూచించారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ఫోర్టిఫైడ్ రా రైస్ లేదా ఫోర్టిఫైట్ బాయిల్డ్ రైస్ (బియ్యం) ఇవ్వాల్సి ఉన్నందున దానికి తగిన బ్లెండింగ్, సోర్టెక్స్ మెషినరీని డిసెంబరు 31వ తేదీలోపు సమకూర్చుకోవాలని ఆ సౌకర్యం ఇప్పటివరకూ లేని అన్ని మిల్లులకు కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసింది.

ఆంక్షలతో డైలమాలో మిల్లుల యజమానులు

గత ప్రభుత్వ హయాంలో మిల్లింగ్ రైస్ గోల్‌మాల్ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వ దర్యాప్తులో తేలడంతో అన్ని మిల్లుల్లో ఫామ్-ఏ (బియ్యంగా మార్చడానికి వచ్చే వడ్ల క్వాంటిటీ), ఫామ్-బీ (ప్రైవేటు మిల్లర్లు, వ్యాపారుల ట్రేడింగ్ అవసరాల కోసం మిల్లింగ్ కోసం వచ్చిన వడ్ల క్వాంటిటీ) రిజిస్టర్లను వేర్వేరుగా నిర్వహించాలని కార్పొరేషన్ పేర్కొన్నది. ప్రతి మిల్లు విధిగా కార్పొరేషన్ నుంచి చేసే కేటాయింపుల ప్రకారం మిల్లింగ్ చేయాల్సిందేనని, రెండు వారాల్లో (15 రోజులు) బియ్యంగా మార్చి కార్పొరేషన్‌కు అప్పగించాల్సిందేనని నొక్కిచెప్పింది. బ్యాంకు గ్యారంటీ షరతు, క్వింటాల్‌కు రూ.10 మాత్రమే కమీషన్ (మిల్లింగ్) చార్జీలతో మిల్లుల యజమానులు డైలమాలో పడ్డారు. దాదాపు 80 లక్షల టన్నుల మిల్లింగ్ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారు. ఇది ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కు కూడా సమస్యగా మారింది. 


Similar News