TG News : ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం(AP Govt) కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల(AP Projects)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల(AP Projects)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టనుంది. కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్(Ralayaseema Lift Irrigation), గోదావరి బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla)పై సుప్రీంకోర్ట్ కు వెళ్లనున్నామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) తెలిపారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, ఏజీతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఏపీ పలు ప్రాజెక్టులు నిర్మిస్తుందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కూడా ఏపీ అక్రమంగా వాడుకుంటుందని, ఇకపై ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకునేందుకు తాము సిద్ధం అవుతున్నట్టు మంత్రి వెల్లడించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం మరో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి నది నీటితో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం వద్ద 200 టీఎంసీల గోదావరి నీటిని బొల్లపల్లి రిజర్వాయర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మళ్లించనున్నారని ఆయన వెల్లడించారు. తద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు ఏపీ ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందించిందని చెప్పారు. 1980లో జీడబ్ల్యూడీటీ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాలను అక్కడి ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర జల వనరుల సంఘం, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందకుండానే వారు ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46(2),46(3) ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమై కేంద్రం నుండి నిధులు పొందేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది జలాశయాలతో ఏపీ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలిపిన విషయాన్ని వెల్లడించారు. ఇందుకు స్పందించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలకు చెందిన నిపుణుల కమిటీ ఫిబ్రవరి నెలలో రాయలసీమ ప్రాజెక్టును ముందున్న స్థితికి తీసుకురావాలని ఆదేశించిందని ఆయన వివరించారు. పర్యావరణ నిబంధనలను ఏపీ ఉల్లంఘిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, సంబంధిత మంత్రిత్వ శాఖలు చేసిన విజ్ఞప్తుల ఫలితమే ఆ ప్రాజెక్టును పూర్వ స్థితిలో ఉంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇంత జరిగినా ఏపీ ప్రభుత్వం పరోక్ష మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పరిణామాలను చూస్తూ ఊరుకోబోదని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు ముందు ఉంచడంతోపాటు ఏపీ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనపై వాదనలు వినిపించి అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.రాయలసీమకు గోదావరి వరద నీటిని మళ్లిస్తే భద్రాచలం వంటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన ఉదాసీనతతోని ఏపీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందన్నారు. అక్రమంగా నీటిని ఆంద్రప్రదేశ్ తరలించుకుంటు పోతుంటే బీఆర్ఎస్ చోద్యంలా చూసింది మినహా అడ్డుకోలేక పోయిందని ఆరోపించారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడికతీత పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం పెంచేందుకు పూడిక తీత పనులు చేపట్టామన్నారు.