ఉద్యోగుల తొలగింపులు.. కొత్త లిస్ట్ రెడీ!

రవాణాశాఖలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలతో ఆ శాఖపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురికి ఉద్వాసన పలికిన సర్కార్.. మరో 56 మందిని తొలగించేందుకు లిస్ట్ రెడీ చేసింది.

Update: 2024-10-22 02:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణాశాఖలో డీబీఏ(డేటా బేస్ అడ్మినిస్ర్టేటర్)లు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్రంలోని ప్రతి ఆర్టీవో ఆఫీసులో పనిచేస్తున్నారు. ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన వారు రవాణాశాఖ‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో డీబీఏలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా ఆర్టీఏ ఆఫీసులో పనిచేస్తున్న డీబీఏ సురేశ్ మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం అతడిని తొలగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ ఆఫీసుల్లో పనిచేస్తున్న డీబీఏ, ఇతర సిబ్బందిపై సర్కారు నిఘాపెట్టింది. రవాణాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి..ఎవరిపై ఆరోపణలు ఉన్నాయనే వివరాలు సేకరించింది. అందులో భాగంగానే 56 మందితో లిస్టు తయారుచేసినట్టు సమాచారం. విడతల వారీగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారికి ఉద్వాసన పలుకుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పాతిక మందిని తొలగించినట్టు సమాచారం.

వారిదే పెత్తనం..!

ఆర్టీఏ ఆఫీసుల్లో ఔట్ సోర్సింగ్ వారు ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారు. వారికి ట్రాన్స్‌ఫర్స్ ఉండకపోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఏ ఆఫీసర్ వచ్చిన వారిని గుప్పిట్లో పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఆఫీసర్ లేకపోయినా ఆఫీసులో పనులు వారే చక్కబెడతారని విమర్శలున్నాయి. దీనికి తోడు డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీ, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుల్లోనూ ఆరోపణలున్నాయి. అందుకోసం చేతివాటం ప్రదర్శిస్తున్నారని, దీంతో రవాణాశాఖ అభాసుపాలవుతుందని కొంతమంది ఆఫీసర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతి, అరోపణలకు చెక్ పెట్టాలని భావించి ఎవరిపై ఆరోపణలు వస్తున్నాయనే వారిపై ఫోకస్ పెట్టింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కారణమని భావించిన సర్కారు వారిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. విడతల వారీగా చెక్ పెట్టనుంది. స్వయంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ‌నే లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడంతో దశలవారీగా తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. రాష్ట్రంలోని ఆర్టీఏ ఆఫీసులకు లెటర్ వెళ్లిన వెంటనే అక్కడి సంబంధిత అధికారులు డీబీఏలను తొలగిస్తూ సంబంధిత ఉత్తర్వులను ఇస్తున్నారు.


Similar News