తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకనుంచి 24 గంటలు ఓపెన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి రాష్ట్రంలో షాపులు 24 గంటలు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరం అంటూ గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇకపైన 24 గంటలూ షాపింగ్ చేసుకోడానికి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (1988)లోని సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇకపైన 24 గంటలూ తెరిచే ఉంచేలా వెసులుబాటు కల్పిస్తున్నది. సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అదనపు ఫీజు చెల్లిస్తే ఆ దుకాణాన్ని సంవత్సరం పొడవునా పగలూ రేయి అనే తేడా లేకుండా ఓపెన్ చేసి ఉంచుకోవచ్చని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 4వ తేదీన జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నా శుక్రవారం రాత్రి అది వెలుగులోకి వచ్చింది. దుకాణాలను ఎప్పుడూ తెరుచుకునే ఉంచుకోడానికి అదనపు ఫీజు కట్టడంతో పాటు మరో 11 షరతులను విధించింది. అవన్నీ పాటిస్తేనే ఈ వెసులుబాటు లభిస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని జీవో (నెం.4) లో పేర్కొన్నారు.
ప్రభుత్వం విధించిన షరతులు ఇవీ :
= దుకాణంలో పనిచేసే ప్రతి కార్మికుడు/ఉద్యోగికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా మంజూరు చేయాలి.
= సిబ్బందికి వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలుచేయాలి.
= ప్రతీ వారం సిబ్బందికి నిర్దిష్టంగా పని గంటలను నిర్ణయించాలి.
= అంతకంటే ఎక్కువసేపు పనిచేస్తున్నట్లయితే ఓవర్ టైమ్ వేతనాన్ని చెల్లించాలి.
= ప్రభుత్వ సెలవుదినాలు, జాతీయ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు పనిచేస్తే దానికి బదులుగా మరో రోజున సీ-ఆఫ్ తీసుకునే వెసులుబాటు సిబ్బందికి ఉండాలి.
= దుకాణాల్లో పనిచేసే మహిళలకు తగిన భద్రత కల్పించాలి
= రాత్రి షిప్టులో పనిచేసే మహిళా సిబ్బంది నుంచి విధిగా సమ్మతిని రాతపూర్వకంగా తీసుకోవాలి.
= రాత్రి షిప్టుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి రానుపోను సౌకర్యాన్ని దుకాణం యాజమాన్యం కల్పించాలి.
= రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆ దుకాణం యాజమాన్యం క్రమం తప్పకుండా రికార్డులను సమర్పించాలి.
= పోలీసు యాక్టులోని నిబంధనలకు అనుగుణంగా ఈ దుకాణాలు 24 గంటలు పనిచేయడం ఆధారపడి ఉంటుంది.