విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

విద్యార్థులకు నోట్ బుక్స్, వర్క్ బుక్స్‌ను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Update: 2023-05-03 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్ బుక్స్, వర్క్ బుక్స్‌ను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై అధికారులతో ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వర్క్ బుక్స్, నోట్ పుస్తకాలను పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా రానున్న విద్యా సంవత్సరానికి గాను రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వాటితో పాటు దాదాపు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌ను పాఠశాల పునఃప్రారంభం నాటికి అందేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీంతో మొత్తం వ్యయం రూ.350 కోట్లకు చేరింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.

స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫాంను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి స్పష్టంచేశారు. స్కూళ్ల రీఓపెన్ రోజు పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News