అధికారులకు రేవంత్ సర్కార్ ఆదేశాలు.. వాళ్లు ఫుల్ హ్యాపీ
తెలంగాణ రాష్ర్టంలోని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లలో ప్రభుత్వం భరోసా నింపింది. అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ర్టంలోని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లలో ప్రభుత్వం భరోసా నింపింది. అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, ఉబర్, స్విగ్గి, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, అర్బన్ కంపెనీ, పోర్టర్‌లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ యూనియన్ నాయకుడు షేక్ సలావుద్దీన్ విన్నవించాడు. రాహుల్ వీరితో మరోసారి చర్చించి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని పలు సూచనలు చేశారు. సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. డిమాండ్లు పరిష్కరించేందుకు కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రమాద బీమా సౌకర్యం
ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో టీహబ్ ద్వారా సర్కార్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కల్పించేందుకు వీలుగా ఓ యాప్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లున్నారు. రాజస్థాన్ లో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేశారు. అక్కడ అమలవుతున్న చట్టాన్ని స్టడీ చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని సీఎం హామీ ఇవ్వడంపై యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.