CM జగన్ దాడి ఘటనపై స్పందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో ప్రసంగిస్తుండగా అనూహ్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో ప్రసంగిస్తుండగా అనూహ్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా అందరూ స్పందించారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రస్తుతం ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచిది కాదని ఖండించారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.