TGCSB: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ భారీ ఆపరేషన్.. 27 మంది అరెస్ట్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. 27 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు.

Update: 2024-10-01 04:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాజస్థాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి భారీగా చెక్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మధ్యాహ్నం 3 గంటలకు ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. 

కాగా.. రాజస్థాన్ లోని పింప్రీ చించ్ వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సీనియర్ సిటిజన్ ను కోటి రూపాయలకు పైగా మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ కు చెందిన మయాంక్ అశోక్ కుమార్ గోయల్ (20) తన స్నేహితులతో కలిసి ఎస్బీఐ, సీబీఐ ఉద్యోగులం అని చెప్పి.. మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సందీప్ దోయిఫోడ్ వెల్లడించారు.

60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేసి.. మనీలాండరింగ్ పేరుతో బెదిరించి.. అతని బ్యాంక్ ఖాతా వివరాలను పొందారని, ఆ తర్వాత ఆ ఖాతా నుంచి కోటి 8 లక్షల రూపాయల్ని దోచుకున్నారని తెలిపారు. ఆ డబ్బును గుజరాత్, రాజస్థాన్ లకు తరలించారని, గోయల్ అరెస్టుతో మిగతా ముగ్గురి ఆచూకీ తెలుసుకుని వారిని అరెస్ట్ చేశామన్నారు. విచారణలో నగదును రికవర్ చేసి.. బాధితుడికి అందిస్తామని డీఎస్పీ సందీప్ తెలిపారు.


Similar News