బిగ్ న్యూస్: T- బీజేపీ మరో ప్లాన్.. నేతలు నిత్యం ప్రజల్లోనే ఉండేలా సరికొత్త స్ట్రాటజీ!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని బీజేపీ నిర్ణయించుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని బీజేపీ నిర్ణయించుకుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు గేట్ వేగా తెలంగాణను ఫిక్స్ చేసుకున్న జాతీయ నాయకత్వం.. పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. అందుకే ప్రతి పార్లమెంట్ పరిధిలో నేతలను సమన్వయం చేయడంపై దృష్టిసారిస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికే విస్తారక్‌లను నియమించిన నాయకత్వం ఇప్పుడు వారికి ద్విచక్ర వాహనాలను అప్పగించనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఒక్కో బైక్ చొప్పున మొత్తం 17 ద్విచక్ర వాహనాలను జాతీయ నాయకత్వం పంపించినట్లు సమాచారం. విస్తారక్‌లు పూర్తిస్థాయిగా నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ఇప్పటికే వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న కాషాయదళం.. నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. త్వరలోనే పార్లమెంట్ సెగ్మెంట్‌కో బైక్‌ను అందించనుంది. పార్లమెంట్ విస్తారక్‌కు వీటిని ఇవ్వనుంది. ప్రత్యేక కిట్‌తో వారు నిత్యం ప్రజల్లో తిరిగేలా యాక్షన్ ప్లాన్ బీజేపీ రూపొదించింది. ఆ కిట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా పార్టీని అసెంబ్లీ, మండల, గ్రామ, బూత్ స్థాయిలో బలోపేతం చేయడంపైనా వారు దృష్టి సారించనున్నారు. బూత్ కమిటీల నియామకంతో పాటు మండల కమిటీలు, శక్తికేంద్రాల వారీగా బూత్ స్థాయిలో బలోపేతం కావడంపై ఈ ప్రక్రియ దోహదపడుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఏదైనా ఒక పార్లమెంట్ పరిధిలో సమావేశాలు నిర్వహించినా, సభలు నిర్వహించినా నేతల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ బాధ్యతలు విస్తారక్‌లు చూసుకునేలా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. అందుకే నిత్యం పర్యటనలు చేస్తూ లోటుపాట్లను గుర్తించి రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించేలా ప్లాన్ చేసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో వారి పర్యటనలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం 17 ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం అధికార పార్టీకి బెంబేలెత్తిస్తోంది. కాగా త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 119 ద్విచక్ర వాహనాలను సైతం తీసుకు వచ్చే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది చూడాల్సి ఉంది.