Telangana Speaker: ఎమ్మెల్యేల గౌరవం కాపాడాల్సిన బాధ్యత నామీద ఉంది

తెలంగాణ ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-09-04 12:27 GMT

దిశ, వెబ్‌వెబ్: తెలంగాణ ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham)కు జరిగిన అవమానం గురించి తనకు స్పష్టంగా వివరించారని అన్నారు. వారి ఆవేదనను తాను అర్థం చేసుకున్నట్లు తెలిపారు. వెంటనే ఘటనపై సమగ్ర వివరాలను తెప్పించుకుంటానని అన్నారు. ఎమ్మెల్యేల హక్కులకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాసనసభ నియమాల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) హామీ ఇచ్చారు.

కాగా, ఆగష్టు 30 వ తేదీన భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులతో కలిసి ఎమ్మెల్యే వీరేశం పాల్గొన్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు గుర్తుపట్టకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అలకబూనిన వీరేశం అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాజాగా.. సదరు ఘటనపై బుధవారం శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏడ ప్రజాప్రతినిధికి కూడా ఇలా కావద్దని వీరేశం ఆకాంక్షించారు.


Similar News