SC వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)ను తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదించింది.

Update: 2025-03-18 11:29 GMT
SC వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)ను తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదించింది. బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహా సభలో ప్రవేశ పెట్టగా.. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది అని.. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడ్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.

‘దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ(AICC) అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారని అన్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

Tags:    

Similar News