TDP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ లో టీడీపీ సంచలనం

తెలంగాణలో టీడీపీ మరోసారి యాక్టివ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తుండటం హాట్ టాపిక్ గా మారుతున్నది.

Update: 2024-10-07 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తిరిగి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తీగల.. తాను నూటికి నూరు శాతం టీడీపీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభం తీసుకువచ్చేందుకు చంద్రబాబును కలిశామని చెప్పారు. మరోసారి పిలిచి మాతో మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారన్నారు. నాతో పాటు చాలా మంది నాయకులు టీడీపీలో చేరుతారని ప్రకటించారు. టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో చాలా మంది ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు ఉన్నారని వారందరిని ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. దీంతో తీగల బాటలో ఎవరెరు టీడీపీ గూటికి చేరబోతున్నారనేది సర్వత్రా సస్పెన్స్ గా మారింది.

మల్లారెడ్డిపై ఊహాగానాలు:

నిజానికి గత కొంత కాలంగా మల్లారెడ్డి టీడీపీలో చేరుతానే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారని ఇందులో భాగంగానే గతంలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సైతం కలిశారనే ప్రచారం జరిగింది. ఇక బీజేపీతోనూ మంతనాలు జరిపినా ఆ పార్టీ నుంచి రూట్ క్లియర్ కాకపోవడంతో ఆయన ఆగిపోయారనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, తాను గతంలో టీడీపీ నుంచే ఎంపీగా గెలవడంతో చంద్రబాబుతో ఉన్న పరిచయం కారణంగా ఆయన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఇవాళ తన అల్లుడితో పాటు చంద్రబాబుతో భేటీ కావడం, మల్లారెడ్డి సమక్షంలోనే తీగల తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే మూడు రోజుల క్రితమే మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా తన అల్లుడితో కలిసి టీడీపీ అధినేతను కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తాను వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకే చంద్రబాబుతో భేటీ అయ్యానని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లో జరగబోయే శుభకార్యం అనంతం మల్లారెడ్డి రాజకీయంగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనేది పొలిటికల్ కారిడార్ లో చర్చగా మారింది.

'స్థానిక' ఎన్నికల వేళ సంచలన పరిణామం:

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతున్నదని ఇందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని గత జూన్ లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీ టీడీపీకి అధ్యక్షుడిని నియమిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్త రాగం ఆలపిస్తున్న తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ప్రకటించడం, మల్లారెడ్డి వంటి నేతలు సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదు కాబోతున్నాయనే చర్చ జోరందుకుంది.


Similar News