టార్గెట్ Mallareddy.. ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు!
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ భాగస్వాముల నివాసాల్లోనూ ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ భాగస్వాముల నివాసాల్లోనూ ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. మంగళవారం తెల్లవారుజాము 5.45 గంటలకు మొదలు పెట్టి పొద్దుపోయేదాకా కొనసాగించారు. మొత్తంగా రూ. 4.5 కోట్ల నగదు, కీలకమైన డాక్యుమెంట్లు, విలువైన భూముల రికార్డులు లభించగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒకేసారి 52 బృందాలు 14 చోట్ల తనిఖీలు చేశాయి. ఐటీ దాడులు ఇంకా కొనసాగిస్తున్నట్టు, మరో రెండు రోజులు జరిగే అవకాశం ఉందని అధికారుల సమాచారం. ఎలక్ట్రానిక్ లాకర్లను తెరిచిన తర్వాత లభించేవాటిని బట్టి ఐటీ అధికారులు అధికారికంగా వివరాలను వెల్లడిస్తారు.
ఏకకాలంలో సోదాలు
బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కొంపల్లిలోని మంత్రి కొడుకు భద్రారెడ్డి, గుండ్లపోచంపల్లిలోని మరో కొడుకు మహేందర్ రెడ్డి, సోదరుడు జీడిమెట్ల, సుచిత్ర ఏరియాలో ఉండే బంధువులు, సన్నిహితుల ఇండ్లలో ఏక కాలంలో రెయిడ్స్ కొనసాగించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు పలు విద్యా సంస్థలు, అనుబంధ ఆస్పత్రులు, మంత్రికి చెందిన వివిధ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టాయి. బంధువులు రఘునాథరెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు , త్రిశూల్‌రెడ్డి నివాసంలో రూ. 2 కోట్ల నగదు లభించింది.
కోట్లలో వసూలు ఆరోపణలపై..
కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ సోదాల్లో రికార్డులు, రిజిస్టర్‌లు, విద్యార్థుల అడ్మిషన్లు, వసూలు చేసిన ఫీజుల వివరాలను అధికారులు పరిశీలించారు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీల్లోని రికార్డులను సేకరించారు. మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లలో భారీమొత్తంలో నగదు తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలతోనే రికార్డులపై దృష్టి పెట్టాయి. అయితే మెడికల్ కాలేజీ అడ్మిషన్లతో మంత్రి రూ. కోట్లలో సంపాదించినట్లు రాష్ట్రంలో చాలాకాలంగా ఆరోపణలు ఉన్నవే. ఇప్పుడు అవి ఏ స్థాయిలో ఉన్నాయో వెలుగులోకి రావచ్చు. ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపు వంటి అంశాలపై దర్యాప్తు లోతుగా చేసిన తర్వాతే క్లారిటీ రానుంది. ఇక విద్యా సంస్థలకు సంబంధించి క్రాంతి సహకార అర్బన్ బ్యాంకులోని ఖాతాలు, లావాదేవీలు, సెకండ్ ఛానల్‌లోని రిజర్వు నగదు, ఖాతాదారుల వివరాల ఇలా అనేక కోణాల్లో ఐటీ టీమ్‌లు వివరాలు తీసుకుని ఆరా తీసే పనిలో పడ్డాయి. మరోవైపు బ్యాంకు వైస్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. కాగా.. తనిఖీలు చేస్తుండగానే మంత్రి తన ఫోన్‌ను గోనె సంచిలో దాచిపెట్టారు. ఐటీ అధికారులు చూసి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌లోని కాల్‌డాటా, వివరాలపై ఐటీ టెక్నికల్ వింగ్ స్టడీ చేయనుంది. సిబ్బంది ఫోన్లను కూడా తీసుకుని స్విచ్ఛాఫ్ చేశారు.
గేటు ముందే అడ్డుకొని వాదనకు దిగి..
సోదాలు చేసేందుకు వచ్చిన ఐటీ అధికారులను మంత్రి బంధువులు, సన్నిహితులైన ప్రవీణ్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి గేటు ఇంటి ముందే అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు చెప్పినా వినకుండా చాలాసేపు అనుమతించలేదు. ఒక దశలో గేట్లను నెట్టుకుని లోపలకు వెళ్లాల్సి వచ్చింది. మంత్రి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్‌ను గుర్తించి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాజశేఖర్ రెడ్డి దంపతులు టర్కీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. ప్రవీణ్‌రెడ్డి, సంతోష్ రెడ్డి ఇండ్లలోనూ ఎలక్ట్రానిక్ లాకర్లపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. అయితే సోదాల వివరాలు బైటకు పొక్కనీయలేదు. బుధవారం కూడా సోదాలు జరిగిన తర్వాతే కొంత క్లారిటీ రానుంది. మల్లారెడ్డికి విద్యా సంస్థలు, కొన్ని రియల్ సంస్థల్లో మంత్రి కొడుకు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నందునే ఆర్థిక లావాదేవీలపైనా ఐటీ టీమ్‌లు ఫోకస్ చేశాయి. మంత్రి సన్నిహితుడు సుచిత్రా సమీపంలో ఉండే నర్సింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
రెండు నెలలుగా కసరత్తు
మంత్రి మల్లారెడ్డి ఐటీ రిటర్న్‌లను పరిగణనలోకి తీసుకుని ఐటీ అధికారులు సోదాలకు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. మంత్రితో పాటు కొడుకులు, సోదరులు, అల్లుడు, మేనల్లుడు, వియ్యంకులు, బంధువులు, సన్నిహితులు, విద్యాసంస్థల డైరెక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములు.. ఇలా సంబంధిత అందరి ఇండ్లు, ఆఫీసులు, గెస్ట్ హౌజ్‌లు, బ్యాంకు ఖాతాలు సమాచారం సేకరించుకునేందుకు తగినంత సమయం తీసుకుని ఒక్కసారిగా ఆకస్మిక దాడులకు దిగారు. కేంద్ర పారామిలిటరీ బలగాల భద్రత నడుమ 52 టీమ్‌లు ఒక్కో అడ్రస్‌కు వెళ్లిపోయాయి. సరిగ్గా ఒకేసారి అన్ని చోట్లా దాడులు చేపట్టాయి. కొన్ని చోట్ల లభించిన సమాచారం, ఫోన్లలోని కాల్ డేటా, చివరిసారి మాట్లాడిన వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని కూడా వారి ఇండ్లకు వెళ్లి రెయిడ్స్ కొనసాగించాయి. ఐటీ, ఈడీ దాడులపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముందుగానే అనుమానం ఉండగా, ఆకస్మికంగా సోదాలు జరుగుతాయని ఊహించలేదు. ఒక్కసారిగా దాడులకు దిగడంతో టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. మంత్రి అనుచరులు నిరసన చేపట్టారు. స్వయంగా మంత్రి బైటకు వచ్చి వారిని వారించి పంపించారు.
Read more: