ఇంటర్ లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన ‘దిశ’ రిపోర్టర్ తనయుడు
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో నవాబ్ పేట మండల దిశ రిపోర్టర్ యాది లాల్ జి, అనురాధ దంపతుల రెండవ కుమారుడు కర్నెకోట నాగకరి సాయి తేజ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.
దిశ, జడ్చర్ల: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో నవాబ్ పేట మండల దిశ రిపోర్టర్ యాది లాల్ జి, అనురాధ దంపతుల రెండవ కుమారుడు కర్నెకోట నాగకరి సాయి తేజ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. నవాబ్ పేట మండలం దొడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయి తేజ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మొత్తం జడ్చర్లలోని ఉదయ మెమోరియల్ హైస్కూల్ లో పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు.
ప్రథమ సంవత్సరంలోనూ రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకును సాధించిన సాయి తేజ ద్వితీయ సంవత్సరంలోనూ అదే స్థాయిలో శ్రమించి 1000 మార్కులకు గాను ఏకంగా 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రథమ, ద్వితీయ భాషలు మినహాయించి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ లోను 100% మార్కులు సాధించాడు. ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్ లో రాణించి అడ్వాన్సుడ్ కు అర్హత సాధించాడు. గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలలోను సాయి తేజ రాష్ట్రస్థాయిలో 11 వ ర్యాంకు సాధించాడు.
చదువుకోవడానికి మారుమూల ప్రాంతాలు, బీదరికం వంటివి ఏవి కూడా అడ్డు రావని సాయి తేజ నిరూపించాడు. ఇంటర్మీడియట్ లోనే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలలో రాణిస్తూ నవాబ్ పేట మండలానికి కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఖ్యాతిని తీసుకు వస్తున్న సాయి తేజను, అతడి తల్లిదండ్రులను పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు అభినందిస్తున్నారు.