బీఆర్ఎస్ సర్కార్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు
తమిళనాడు, తెలంగాణకు చాలా దగ్గరి పోలికలున్నాయని, ఈ రెండు రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఏలుతున్నాయని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: తమిళనాడు, తెలంగాణకు చాలా దగ్గరి పోలికలున్నాయని, ఈ రెండు రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఏలుతున్నాయని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేశారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో విద్య, వైద్యం సహా అన్నిరంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్ లెట్స్ కూడా లేవని విరుచుకుపడ్డారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై వచ్చే ఆదాయాన్ని నమ్ముకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమిళనాడులో 18 నుంచి 60 మధ్య వయసున్న 90 శాతం మంది యువత మద్యానికి బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో 9 మంది మంత్రుల మీద అవినీతి కేసులున్నాయని, ఇక్కడా అదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయం కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఐటీ హబ్ అని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
ధరణి అవకతవకలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. టీఎస్పీఎస్సీ లీకేజీతో బీఆర్ఎస్.. యువత జీవితాలతో ఆడుకుందని విరుచుకుపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాను పర్యటించానని, అక్కడి ప్రజలు ప్రభుత్వ తీరుపై చాలా ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన పేర్కొన్నారు. ఒక పార్టీ హైదరాబాద్‌పై కన్నేస్తే, మరోపార్టీ ఢిల్లీపై కన్నేసిందన్నారు.