నిజాం సమాధి వద్ద మోకరిల్లే పార్టీలకు బుద్ధి చెప్పాలే: బండి సంజయ్ ఫైర్
దేశ వారసత్వ సంపదను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. మమ్మీ, డాడీ సంస్కృతి పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వారసత్వ సంపదను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. మమ్మీ, డాడీ సంస్కృతి పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలను బట్టలిప్పి బతకమ్మలాడించిన నిజాం రాజు సమాధి వద్ద మోకరిల్లే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అలాంటి పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీలను తరిమికొట్టి బుద్ధి చెప్పాలన్నారు. శనివారం కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన బండి సంజయ్.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకుపోతున్నదని చెప్పారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ‘పంచ్ ప్రాణ్’ పేరుతో 5 అద్బుత లక్ష్యాలతో ఈ యువ ఉత్సవ్ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. దేశభక్తి, సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యువతలోని నైపుణ్యాలను వెలికితీసి దేశాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ఈ యువ ఉత్సవ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశాల్లో 5వ స్థానంలో ఉందని.. మరో మూడేళ్లలో దీనిని 3వ స్థానానికి చేర్చేందుకు ప్రధాని మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో భారత్ చేరిందని 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతోందన్నారు. మోడీ పాలనలోని అభివృద్ధి శాంతి మంత్రంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సొంతం చేసుకుందన్నారు.
దేశ సంస్కృతి, సార్వభౌమత్వంపై దాడి చేసి మన సంపద కొల్లగొట్టిన వారి పేర్ల మీద ఢిల్లీ వీధులు, రోడ్లకు పేర్లు ఉన్నాయని అలాంటి పేర్లను తొలగించడమే కాకుండా బానిస భావ జాలం నుండి దేశాన్ని, ప్రజలను విముక్తి కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల వరకు నావికా దళం జెండాపై సెయింట్ జార్జ్ లూయీస్ పేరుతో ఉన్న సింబలే కొనసాగిందని.. అదే మోడీ హాయాంలో దాని స్థానంలో ఛత్రపతి శివాజీ రాజముద్రను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత సంస్కృతిని అనుసరించే స్థాయికి దేశం ఎదిగిందని గతంలో యోగా పట్ల చులకన భావం ఉండేదని ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో 190 దేశాలను ఒప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించారంటే అది మోడీ గొప్పతనం అన్నారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా నరేంద్ర మోడీ నేరుగా విద్యార్థుల, యువతతో మాట్లాడుతున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి: మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష