మునుగోడులో సస్పెన్స్.. పాల్వాయి స్రవంతి నిర్ణయంపై ఉత్కంఠ
రెండో జాబితా ప్రకటన టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. టికెట్
దిశ, వెబ్‌డెస్క్: రెండో జాబితా ప్రకటన టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. టికెట్లు లభించని నేతలందరూ అసంతృప్తితో వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇవాళ పలువురు నేతలు రాజీనామా చేయగా.. మరికొంతమంది నేతలు సమాలోచనలు చేస్తోన్నారు. వేరే పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కొంతమంది నేతలు ఉన్నారు.
ఈ క్రమంలో మునుగోడు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పాల్వాయి స్రవంతి శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్‌లోని గార్డెన్‌లో అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనను కాదని మళ్లీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాల్వాయి స్రవంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.
గత ఎన్నికల్లో కూడా మునుగోడు టికెట్‌ని ఆశించి పాల్వాయి స్రవంతి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీలోకి దిగారు. ఆ తర్వాత మునుగోడు ఉపఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించిన ఆమెకు మరోసారి చుక్కెదురైంది. ఇలాంటి తరుణంలో పాల్వాయి స్రవంతి నిర్ణయంపై మునుగోడు నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.