పాలేరు టికెట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. తుమ్మల ఇన్ OR ఔట్
‘పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది.
‘పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ద్రోహి. ఇక్కడి ఎమ్మెల్యేను చూసి జనాలు సిగ్గుపడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టిస్తున్నాడు. నాలుగు నెలలు ఆగితే నిన్ను, నీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయం. మీ ఓటును, మీ నమ్మకాన్ని అమ్ముకునే ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వకండి’- పీపుల్స్ మార్చ్ సభలో భట్టి విక్రమార్క
పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో ఉండటం పక్కా. అభ్యర్థిగా కందాళ ఉపేందర్ రెడ్డే ఉంటారు. సీఎం కేసీఆరే ఈ విషయం స్పష్టం చేశారు. ఉపేందర్ రెడ్డి పనితీరు బాగుందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలోనే అత్యంత ప్రజాబలం ఉన్న నాయకుడు కందాళ. త్వరలో పాలేరులో ఉపేందర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసే విధంగా నియోజకవర్గ ఇన్చార్జీని నియమిస్తాం - జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు
దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే పొంగులేటి ఎపిసోడ్ ఒకటైతే.. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు అధికార బీఆర్ఎస్‌ను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో అటు సిట్టింగ్‌లు, ఇటు మాజీలతో పార్టీ అతలాకుతలం అవుతుంది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక కొందరు ఆయన వర్గంలో చేరగా.. మరికొందరు పార్టీలో ఉంటూనే ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ స్థానాల్లో ఒకటైన పాలేరు హాట్ సీటుగా మారింది.
అధికార పార్టీలోని ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని అనుచరులకు చెబుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మధ్య సీటు గొడవ అనుచరులకు మింగుడు పడకుండా ఉంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా మాజీ మంత్రి తుమ్మల ఇప్పటికే తన స్థావరాన్ని ఖమ్మంలోని శ్రీసిటీకి మార్చి అనుచరులకు అందుబాటులో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ సైతం ఏకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరికి వారు పోటీకి సై అంటుంటే ద్వితీయ శ్రేణి నాయకులు, అనుచరులు జుట్టు పీక్కుంటున్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ..
కొద్దిరోజుల క్రితం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని, ప్రభుత్వంలో తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని తుమ్మలకు మంత్రులు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, తప్పకుండా భవిష్యత్‌లో ప్రియారిటీ ఉంటుందని తెలిపినట్లు అంటున్నారు. అయితే వారి ఆఫర్‌ను తుమ్మల తిరస్కరించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తుమ్మల స్పష్టం చేశారని అనుచరులు చెబుతున్నారు.
తుమ్మల వ్యాఖ్యలతో కంగుతిన్న మంత్రులు ఏమి చెప్పాలో తెలియక మీ ఇష్టం అంటూ భేటీని ముగించారని, తుమ్మల చెప్పిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రులతో జరిగిన భేటీలోనే తుమ్మలకు ఓ స్పష్టత వచ్చిందని, మంత్రులు కూడా ప్రొసీడ్ అన్నట్లు మరో వర్గం ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే తుమ్మల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అనుచరులతో ఈ మధ్యే జరిపిన రహస్య సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో టికెట్ మనకే వస్తుందని, పోటీలో మనమే ఉంటామని తుమ్మల.. అనుచరులకు క్లియర్ కట్‌గా వెల్లడించినట్లు టాక్.
తాత మధు వ్యాఖ్యల వెనుక మర్మమేంటీ?
పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాళ ఉపేందర్ రెడ్డే ఉంటారని, ఈ విషయం సీఎం కేసీఆరే తనకు స్పష్టంగా చెప్పారని కొద్దిరోజుల క్రితం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. జిల్లాలోనే అత్యంత ప్రజాబలం ఉన్న నాయకునిగా కొనియాడారు. ఈ వ్యాఖ్యల వెనుకు ఉన్న మర్మమేంటని రాజకీయ విశ్లేషకులు భూతద్దం పట్టుకుని వెతుకుతున్నారు. అయితే కందాళకే టికెట్ అని ఇప్పటికే స్పష్టత రావడంతో మరి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటనేది అంతుచిక్కకుండా ఉంది. అధికార పార్టీ నేతలు కందాళకే టికెట్ అని వెల్లడించడం.. తుమ్మల నాగేశ్వరరావు తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో ద్వితీయశ్రేణి నాయకులు, అనుచరులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరికి టికెట్ వస్తుందనే విషయంలో ఎవరికివారు లెక్కలేసుకుంటున్నారు. కందాళ ఉపేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ లో చేరారని, వచ్చే ఎన్నికల్లో కందాళ బీఆర్ఎస్ అభ్యర్థి కారని కొందరంటుంటే.. టీడీపీని వదిలినప్పటినుంచి తుమ్మల బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారని, సీనియర్ నేతగా, అభివృద్ధి ప్రదాతగా పేరున్న తుమ్మలకే వచ్చేసారి టికెట్ వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరి పోటీ ఎవరికి కలిసొచ్చేది ఎవరికీ?
పాలేరు బరిలో కందాళ, తుమ్మల ఎవరికివారు పోటీచేస్తామని అనుచరులకు చెబుతుంటే వీరిద్దరి మధ్య అగాథం వచ్చే ఎన్నికల్లో ఎవరకి కలిసివస్తుందో నన్న సందేహం వ్యక్తమవుతుంది. వీరిద్ధరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మరోవ్యక్తిని ఓడించడం గ్యారెంటీ అనే చర్చ జరుగుతుండటం సందేహాలకు తావిస్తుంది. తుమ్మలకు టికెట్ ఇస్తే కందాళ వర్గీయులు, కందాళకు టికెట్ ఇస్తే తుమ్మల వర్గీయులు ఓటమికి కారకులు అవుతారనే టాక్ నడుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ను ఇతర పార్టీ నాయకులు అనుకూలంగా మార్చుకుని గెలిచే అవకాశం లేకపోలేదని చర్చ జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల తన కార్యక్రమాలను సైతం చాప కింద నీరులా సాగిస్తుంది. పాలేరు కాంగ్రెస్‌కు అడ్డా అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఇప్పటికీ ఇక్కడ పార్టీని కాపాడుతున్నారని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కందాళ ఉపేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థేనని గుర్తుచేస్తూ తన మార్క్ రాజకీయాన్ని షర్మిల నడిపిస్తున్నారు. అధికార పార్టీ పోరు ఇతర పార్టీలవారికి కలిసివచ్చే అవకాశం లేకపోలేదనే వాదన వ్యక్తమవుతున్నది.