తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. సీఎం రేవంత్ హామీతో ముందడుగు
యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్‌లో తమ తయారీ యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్‌లో తమ తయారీ యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేయనున్నారు. అందుకోసం రూ.231.5 కోట్ల పెట్టుబడులు సంస్థ పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎండీ గౌరీ శ్రీధర, డైరెక్టర్ అమర్ చీడిపోతు తాజాగా సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో జనరల్ సర్జికల్ పరికరాలు, మైక్రో సర్జరీకి ఉపయోగించే అధునాతన పరికరాలను తయారు చేస్తారు. ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర సంబంధిత సున్నితమైన సర్జరీలకు అవసరమయ్యే తయారు చేస్తుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను తయారీ చేసేలా యూనిట్‌ను విస్తరిస్తారు. ఈ కంపెనీ యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్, అక్కడి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ) హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు తమ పరికరాలను సరఫరా చేస్తున్నది.