కాళేశ్వరంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మూడో టీఎంసీపై స్టేటస్ కో ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు సవరించింది.
దిశ, డైనమిక్ బ్యూరో :కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మూడో టీఎంసీపై స్టేటస్ కో ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు సవరించింది.మూడో టీఎంసీ కోసం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ కి అనుమతి ఇచ్చింది. కాగా మూడో టీఎంసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం తాము భూములు ఇచ్చేది లేదని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో పక్క మూడో టీఎంసీ పనులకు సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు అనుమతి లేదని చెరుకు శ్రీనివాస్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు గతంలోనే మూడో టీఎంసీ పనులపై స్టేటస్ కో విధించింది. అయితే స్టేటస్ కో కారణంగా పర్యవరణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పుకు లోబడి ఉంటామని ఈ లోగా మిగతా అనుమతుల ప్రాసెస్ కోసం స్టేటస్ కో తొలగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ మూడో టీఎంసీ కోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.