కేటీఆర్ కుంభకర్ణుడి వారసుడు : షర్మిల కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి గంగిరెద్దులతో ప్రతిపక్షాలను పోల్చే చిన్న దొర.. ఎన్నికల ముందు నిద్రలేచిన కుంభకర్ణుడి అసలైన వారసులే మీరే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి కేటీఆర్‌ను విమర్శించారు.

Update: 2023-09-22 10:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి గంగిరెద్దులతో ప్రతిపక్షాలను పోల్చే చిన్న దొర.. ఎన్నికల ముందు నిద్రలేచిన కుంభకర్ణుడి అసలైన వారసులే మీరే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి కేటీఆర్‌ను విమర్శించారు. ఓట్ల ముందే ప్రజలు గుర్తుకొస్తారని, అప్పుడే వారు నిద్రలేస్తారని, పథకాలను నిద్ర లేపుతారని విమర్శించారు. కొత్త కొత్త స్కీంలంటూ పిట్ట కథలు చెప్తారని, మాయమాటలతో మాయాజాలం చేస్తారని, పప్పులు ఉడకవని తెలిస్తే సెంటిమెంట్ ను రాజేస్తారని ఇవాళ ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. అభివృద్ధి తప్ప అన్ని విద్యలు ప్రదర్శిస్తారని, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మళ్లీ జనం వైపు కన్నెత్తి కూడా చూడరన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అణగదొక్కడం, అరెస్టులు చేయడం ఇదే వారికి తెలిసిన విద్య అని పేర్కొన్నారు.

రెండు సార్లు ప్రజలు పట్టం కడితే పెట్టినవి పంగనామాలే తప్ప ఒక్క వర్గానికైనా మేలు జరగలేదని విమర్శించారు. ఎనమిదేళ్లలో ముష్టి 30వేల ఇండ్లు కట్టించారని ఆరోపించారు. 2.90 లక్షల ఇండ్లు కడతామని చెప్పి లక్ష ఇండ్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అల్లుడు, ఆత్మగౌరవం అంటూ ఉన్న గుడిసెకు కూడా దిక్కులేదన్నారు. స్కీముల పేరుతో స్కాంలు చేసి రూ.లక్ష కోట్లు కాజేశారని ఆరోపించారు. ఇన్నేళ్లుగా పథకాలను అటకెక్కించి, ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ముదులిపి, నలుగురికి మమ అనిపించి.. మరిన్ని కొత్త పథకాలు అని చెప్తే నమ్మే రోజులు లేవని, పథకాలు, మీరు అంతా ఒక బోగస్ కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News