కాంగ్రెస్‌కు వరుస వైఫల్యాలు.. 'చే'జారిన సిట్టింగ్ స్థానం
కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. మునుగోడు మాదే అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. మునుగోడు మాదే అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితిని ముందుగానే ఊహించారు. కానీ, మునుగోడు సెగ్మెంట్కాంగ్రెస్ సిట్టింగ్స్థానం. ఇక్కడి నుంచి రాజగోపాల్‌రెడ్డి 2018లో హస్తం గుర్తుపైనే గెలిచారు. అంతకు ముందు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా వరుస విజయాలు సాధించారు. కానీ, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు ఇదే నల్గొండ జిల్లా నుంచి ఇంతకుముందు జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది.
హుజూర్‌నగర్‌లో తొలి ఓటమి
నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో తొలి ఉప ఎన్నిక జరిగింది. 2018లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి 2019లో నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేయగా.. సీనియర్ లీడర్లు, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హోరాహోరీ ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2018లో ఓడిపోయిన టీఆర్ఎస్అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు.
సాగర్‌లో 'జానా'కు తప్పలేదు
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక వచ్చింది. 2021లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌నేత జానారెడ్డి పోటీ చేశారు. గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో ఓడిపోయినా.. ఉప ఎన్నికల్లో గెలవడం దాదాపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలిచారు. జానారెడ్డి విజయం కోసం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా సాగర్‌లో మకాం వేసి రెండు నెలల పాటు శ్రమించినా జానాకు ఓటమి తప్పలేదు.
అటు దుబ్బాక, హుజురాబాద్‌లో అంతే..
అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నిక, హుజురాబాద్ఉప ఎన్నిక పార్టీకి పూడ్చుకోలేని నష్టాన్ని చూపించాయి. దుబ్బాకలో 25 వేల ఓట్లతో సరి పెట్టుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి నేతృత్వంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సైతం ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇక్కడ కనీసం 3 వేల ఓట్లు కూడా రాబట్టుకోలేదు. దీంతో రేవంత్ పై సొంత పార్టీలో వ్యతిరేకత వచ్చింది.
ముగ్గురు గెలిచినా.. ఇప్పుడు ఒక్కరు లేరు
2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచింది. హుజూర్నగర్ బైపోల్లో ఓడిపోగా, నకిరేకల్ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జిల్లాలో మిగిలిన మునుగోడు స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఒకప్పుడు కాంగ్రెస్ కు బలంగా భావించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ కుదేలైంది.