HCU : విద్యార్థి సంఘాల గొడవ.. పరస్పర ఫిర్యాదులు

విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది.

Update: 2023-02-25 06:27 GMT

దిశ, శేరిలింగంపల్లి : విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. శుక్రవారం విద్యార్థి సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగగా అదే అర్ధరాత్రి ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు తమపై క్రూరంగా దాడి చేశారని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎఫ్ హాస్టల్ లోపలికి చొరబడి తమపై దాడికి తెగబడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆరోపించారు. మద్యం మత్తులో ఏబీవీపీ విద్యార్థి సంఘం సభ్యులు తమను దుర్భాషలాడుతూ గొడవకు దిగారని, హాస్టల్‌పై దాడి చేసి అద్దాలు పగులగొట్టారని తెలిపారు.

హాస్టల్ ముందు పడి ఉన్న పదునైన గాజు ముక్కలు, సైకిళ్లతో మాపై దాడి చేశారన్నారు. దాడికి గురైన ఎస్‌‌ఎఫ్‌‌ఐ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ఏబీవీపీ విద్యార్థి సంఘం తమపై దాడి చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఘోర ఓటమి భయంతో ఏబీవీపీ హింసను ఆశ్రయిస్తోందని ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా విద్యార్థి లోకమంతా ఐక్యంగా నిలబడాలని కోరారు. అయితే ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దీనిని ఖండించారు. నీళ్లు తాగే దగ్గర తమ సంఘ సభ్యునితో గొడవకు దిగారని, వాల్ పోస్టర్లు చించేశారని, వారిస్తే తమపై దాడికి యత్నించారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. అయితే రెండు విద్యార్థి సంఘాల నాయకులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News