‘సర్వే’లో తప్పుడు సమాచారాన్ని ఇస్తే కఠిన చర్యలు:బీసీ కమిషన్ చైర్మన్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. సరియైన సమాచారం ఇస్తేనే బీసీల వెనకబాటు తెలుస్తుందని ఆయన అన్నారు. సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలన్నారు. శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సర్వేకు సహకరించాలని కోరారు. బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేకపోవడంతో సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు ప్రభుత్వం అప్పగించిందని అన్నారు.
ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు లేకుండా ప్లానింగ్ శాఖ పూర్తిగా ప్రయత్నించాలని బీసీ కమిషన్ కోరుతుందన్నారు. ఎన్యుమరేటర్స్ ఏ రోజు, ఏ ప్రాంతం కుటుంబాలకు వెళతారో స్పష్టంగా ముందస్తు ఆ కుటుంబాలకు సమాచారం అందించే విధంగా సూపర్ వైజర్ లు, పై అధికారులు ప్రయత్నించి కనీసం ఒకరోజు ముందే ఆ సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని అందిస్తేనే బీసీల అసలు సంఖ్య, విద్య, ఆర్థిక, సామాజిక, రంగాల్లో ఉన్న వెనుకబాటుతనం తెలుస్తుందన్నారు. ఎన్యుమరేటర్ల ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రణాళిక శాఖ, కలెక్టర్లు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్లానింగ్ శాఖ సేకరించిన సమాచారం బీసీ కమిషన్ కు అత్యంత కీలకమన్నారు.
ఈ సమాచారాన్ని సమీక్షించి భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి చర్యలు, సూచనలు గురించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు అన్ని విధాలా సహకరించాలని ఎక్కడైనా ఏదైనా లోపాలుంటే ఇచ్చిన సమాచారం దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఉంటే జిల్లా కలెక్టర్ లకు గాని లేదా బీసీ కమిషన్ కు గాని తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ సరైన సమాచారాన్ని అందించాలని, పౌరులుగా కనీస బాధ్యత అని, ఎక్కడైనా, ఎవరైనా అధికారులు గానీ ఎన్యుమరేటర్లు కానీ ప్రజలు కానీ తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే వారిపై చట్టబద్ధమైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కమిషన్ నిష్పక్షపాతంగా, కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.