హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల్లో వింత ధోరణి.. హైడ్రా చర్యలతో మరోసారి వెలుగులోకి!

హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల్లో వింత ధోరణి చోటు చేసుకుంటున్నది. భవన నిర్మాణ అనుమతులు, సవరణలు ఉన్నతాధికారులు చేస్తున్నా.. కిందిస్థాయి అధికారుల సంతకాలతో అనుమతి పత్రాలు జారీ చేస్తుండడంతో వారే బాధ్యత వహించాల్సి ఉంటున్నది.

Update: 2024-09-20 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల్లో వింత ధోరణి చోటు చేసుకుంటున్నది. భవన నిర్మాణ అనుమతులు, సవరణలు ఉన్నతాధికారులు చేస్తున్నా.. కిందిస్థాయి అధికారుల సంతకాలతో అనుమతి పత్రాలు జారీ చేస్తుండడంతో వారే బాధ్యత వహించాల్సి ఉంటున్నది. హైడ్రా కూల్చివేతలతో కింది స్థాయి ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూముల డేటా కరెక్షన్, నిషేధిత జాబితా నుంచి తొలగింపు, కొత్త పాసు పుస్తకాల జారీ వంటి ప్రక్రియలో తహశీల్దార్ల డిజిటల్ సంతకాలను కలెక్టర్లు పెట్టేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు లోకల్ మున్సిపల్ కమిషనర్ల సంతకాలతో హెచ్ఎండీఏ కమిషనర్ అనుమతులు జారీ చేస్తున్నారు. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు సృష్టించిన ఈ పద్ధతి ద్వారా తాము చేయని పనికి బాధ్యత వహించాల్సి వస్తున్నదని కిందిస్థాయి అధికారులు వాపోతున్నారు.

హెచ్ఎండీఏలో అనుమతులు ఇలా..

అన్ని మునిసిపాలిటీల్లో మూడు లేదా అంత కన్నా ఎక్కువ అంతస్తులు ఉన్న భవంతుల నిర్మాణానికి టీఎస్ బీపాస్ ద్వారా హెచ్ఎండీఏ కార్యాలయం నుంచే అనుమతులు ఇస్తున్నారు. బిల్డర్లు నేరుగా హెచ్ఎండీఏలోనే తమ అప్లికేషన్లను సబ్మిట్ చేసుకునే విధంగా ఫ్లో చార్ట్ తయారు చేశారు. బిల్డింగ్ అప్రూవల్ కు సంబంధించిన ఫైల్స్ ఆ కార్యాలయానికి సంబంధించిన అధికారుల ద్వారా మాత్రమే ప్రాసెస్ జరుగుతున్నాయి. ఫీల్డ్ ఇన్స్ పెక్షన్, భూ సంబంధిత, ఇతర ఏ విషయాల్లోనైనా హెచ్ఎండీఏ అధికారులే పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనుమతుల విషయంలో హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ పైన పని చేస్తున్న టౌన్ ప్లానింగ్, సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఫైల్స్ పై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫైల్ ప్రాసెస్ మొత్తం ఈ-ఫైల్ విధానంలోనే జరుగుతున్నది. బిల్డర్లు తమ అప్లికేషన్లను సబ్మిట్ చేసుకున్న రోజు నుంచి, అనుమతులు ఇచ్చే వరకూ ఏ దశలోనూ సంబంధిత మునిసిపాలిటీ/మునిసిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ డీసీ, జెడ్సీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ప్రమేయం అసలు ఉండడం లేదు.

డిజిటల్ సైన్ మాత్రం లోకల్ ఆఫీసర్లదే

హెచ్ఎండీఏ ఇచ్చే పర్మిషన్లలో ఎక్కడ కూడా హెచ్ఎండీఏ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లుగా ఉండదు. ఆ ప్రాంత మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్ డిజిటల్ సైన్లతో పర్మిషన్లు ఇస్తున్నారు. చివరలో హెచ్ఎండీఏ కమిషనర్ కు కాపీ పంపిస్తున్నట్లు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇది మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలను హెచ్ఎండీఏ కమిషనర్ అఫీషియల్ ఫోర్జరీ చేసినట్టేననే విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు బండ్లగూడలో ఐదంతస్తుల అపార్టుమెంట్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కమిషనర్ అనుమతి ఇచ్చారు. కానీ ఆ అనుమతి పత్రంపై బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ డిజిటల్ సంతకం ఉంటుంది. అయితే అనుమతి పత్రంలో చదివితే అన్ని పరిశీలనలు హెచ్ఎండీఏ అధికారులే చేసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు తమపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని తెలంగాణ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమ పాత్ర ఎక్కడా లేకుండా జారీ చేసే అనుమతులకు తమను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని కమిషనర్లు అంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో అనుమతులు ఇచ్చిన హెచ్ఎండీఏ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో వాటికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అనుమతి పత్రాలపైన ఉన్న సంతకం ప్రకారం స్థానిక అధికారులపైన చర్యలు తీసుకోవాలా? వారి డిజిటల్ సంతకం ద్వారా అనుమతులు ఇచ్చిన హెచ్ఎండీఏ కమిషనర్ పైన కేసులు పెట్టాలా? అన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది.

ధరణిలోనూ ఫోర్జరీనే!

ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్ తో పరిష్కరిస్తే తహశీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఎవరు ఫైనల్ చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు, పాసు పుస్తకాలు రావాలి. కానీ కింది స్థాయి అధికారి డిజిటల్ సంతకం వచ్చేటట్లుగా ధరణి పోర్టల్ను రూపొందించారు. వేలాదిగా పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు. అన్నింటికీ కింది స్థాయి రిపోర్టులే ఆధారం. వాటి ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. కేవలం అప్రూవ్ చేసి తహశీల్దార్లకు పంపితే డిజిటల్ సైన్చేసేస్తారు. ఏ ఉద్దేశ్యంతో ఆ పని కూడా కలెక్టర్లు చేస్తున్నారన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

తిరస్కరించినా ఆమోదం..

పెండింగ్ మ్యుటేషన్ విషయంలో ఓ తహశీల్దార్ చెక్ లిస్టులో ‘నాట్ రికమండెడ్ ఆజ్ ద సెల్లర్ ఈజ్ నాట్ ద పట్టేదార్’ రిమార్కుతో పంపారు. కానీ అది అప్రూవ్ అయింది. ధరణి కోఆర్డినేటర్ ను ప్రశ్నిస్తే ఓవర్ లుక్ లో అయ్యిందని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అప్రూవల్ పొందిన వ్యక్తి స్లాట్ బుక్ చేసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. అప్పుడు గుర్తించకుండానే రిజిస్ట్రేషన్ కూడా భూమి చేసేస్తే చేతులు మారే అవకాశం ఏర్పడుతుంది. ఇలాగే కొన్ని జిల్లాల్లో తహశీల్దార్లు రికమండ్ చేసినా.. కలెక్టర్లు పెండింగులో ఉంచుతున్నారని తెలిసింది. లేదంటే కొన్ని సర్వే నంబర్లు అప్రూవ్ చేయడం, మరికొన్నింటిని పెండింగు పెట్టడమో చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన భూములు, రియల్ ఎస్టేట్ విస్తృతంగా సాగే ప్రాంతాల్లో తహశీల్దార్లు ఆమోదించిన ఫైళ్లు కూడా కలెక్టరేట్లో పెండింగులో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి అప్లికేషన్లను పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చారు. వీటికి తహశీల్దార్లు రిపోర్టు ఇవ్వాలని ఎక్కడా లేదు. అయితే రిపోర్టు ఇవ్వకపోయినా అప్రూవల్ చేస్తే.. తమ సంతకం రావడం ఏమిటని తహశీల్దార్లు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ అప్రూవ్ చేసి తహశీల్దార్ లాగిన్ లోకి పంపిస్తే చాలు.. వెంటనే వెరిఫై చేసి డిజిటల్ సంతకం చేయొచ్చు. దరఖాస్తుదారుడు ఆఫీసుకు కూడా రావాల్సిన అవసరం లేదంటున్నారు.


Similar News