ShantiKumari : రేపటితో స్టిక్కరింగ్ పూర్తి చేయాలి : సీఎస్ శాంతికుమారి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియను శుక్రవారంతో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియను శుక్రవారంతో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈ నెల 9 నుంచి అసలు సర్వే మొదలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాతో కలిసి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సేకరించిన అన్ని వివరాలను వెంటనే కంప్యూటరైజ్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. సర్వేలో అందరూ పాల్గొనేలా ప్రజలను చైతన్య తీసుకరావాలని అధికారులను ఆదేశించారు.