‘బీఆర్ఎస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది’.. హరీశ్ రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను బంద్ పెట్టి ప్రజల బతుకులు రోడ్డున పడేస్తోందన్న హరీశ్ రావుపై రాష్ట్ర మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను బంద్ పెట్టిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీతక్క.. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరను బంద్ పెట్టారంటూ హరీశ్ రావు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలా నాసి రకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిందో అందరికీ తెలుసన్నారు. తమ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరలకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ వారకి ఆర్థిక స్వేచ్చ కల్పిస్తున్నామని తెలిపారు. నిన్నటి దాకా 98.50 కోట్ల మంది ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని, ఈ పథకం కోసం తమ ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.3,325 కోట్లు ఖర్చు చేస్తోందని సీతక్క తెలిపారు.