రాష్ట్ర అవతరణ వేడుకలు.. సిబ్బందికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక ఆదేశాలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సైబరాబాద్ ​పోలీస్ ​కమిషనర్ ​స్టీఫెన్​రవీంద్ర సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

Update: 2023-05-27 14:13 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో/శేరిలింగంపల్లి : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సైబరాబాద్ ​పోలీస్ ​కమిషనర్ ​స్టీఫెన్​రవీంద్ర సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతల కోసం తీసుకున్న చర్యలు.. సాధించిన ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తన కార్యాలయంలో శనివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల సన్నాహకాలపై కమిషనర్​స్టీఫెన్​ రవీంద్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన జూన్​2వ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజులపాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలతో పంచుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన లోగోతో పాటు బ్యానర్లను ప్రతీ పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన పోలీస్ ​అభివృద్ధి, ప్రగతి నివేదికలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. అన్ని పోలీస్​స్టేషన్లు, ఏసీపీ సబ్​డివిజన్ ​కార్యాలయాలను విద్యత్​ దీపాలతో అలంకరించాలని చెప్పారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రిల్స్​ నిర్వహించాలని సూచించారు. మొదటి రోజు జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు ఉంటాయని తెలిపారు. సురక్షా దినోత్సవం రోజున పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాష్ర్టం మొత్తం మీద శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, ఫ్రెండ్లీ పోలీసింగ్ ​విధానం, పోలీసుశాఖ అందిస్తున్న సేవలను వివరించే కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. దుర్గం చెరువు వద్ద సైబరాబాద్ ​పోలీసుల తరఫున లేజర్​షో ఉంటుందని తెలిపారు.

సైబరాబాద్​లో కొత్తగా ఏర్పాటైన మోకిళ్ల, కొల్లూరు, జీనోమ్​ వ్యాలీ, అత్తాపూర్, అల్లాపూర్, సూరారం పోలీస్​స్టేషన్ల ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. ఇక, పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్, తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, హరితోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్​పరిధిలో కనీసం వెయ్యి చొప్పున మొక్కలు నాటాలన్నారు. కమిషనరేట్​మొత్తం మీద అయిదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు. దాంతో పాటు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సైబరాబాద్ ​ట్రాఫిక్ ​జాయింట్​ కమిషనర్ ​నారాయణ నాయక్, ఐపీఎస్ ​అధికారులు నారాయణరెడ్డి, జగదీశ్వర్​రెడ్డి, శ్రీనివాసరావు, కవిత, నితికాపంత్, రితీరాజ్, యోగేశ్​గౌతమ్, రష్మీ పెరుమల్, నంధ్యాల నర్సింహారెడ్డి, నర్సింహారెడ్డితో పాటు అన్ని సబ్ డివిజన్ల ఏసీపీలు, పోలీస్​స్టేషన్ల ఇన్స్​పెక్టర్లు పాల్గొన్నారు.

Also Read..

దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలి : ఎస్పీ భాస్కర్ 

Tags:    

Similar News