రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాల్లేవ్: గవర్నర్

తెలంగాణలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రోటోకాల్ అమలుకావడంలేదని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి మండిపడ్డారు.

Update: 2023-04-24 08:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రోటోకాల్ అమలుకావడంలేదని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి మండిపడ్డారు. చాలా కాలంగా తాను, ముఖ్యమంత్రి సమావేశమైందే లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య తరచూ చర్చలు, సమావేశాలు జరుగుతూ ఉండాలని నొక్కిచెప్పారు. కానీ రెండు సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగడంలేదన్నారు. ముఖ్యమంత్రికి తనకు మధ్య మంచి సంబంధాలు లేవని, ఇందుకు కారణం తాను మాత్రం కాదన్నారు. ముఖ్యమంత్రి ఇగోయిస్టిక్‌గా వ్యవహరిస్తున్నారని, ఆ కారణంగానే తనను కలవడంలేదన్నారు. ఇదే తాను ప్రశ్నించదల్చుకున్న అంశమన్నారు. ఒక గవర్నర్‌గా తన దగ్గరకు వచ్చిన అన్ని బిల్లులను దాదాపుగా ఆమోదిస్తూనే ఉన్నానని వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

ఇప్పటికీ తన దగ్గర కొన్ని బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, వాటికి ఆమోదం తెలపాల్సి ఉన్నదన్నారు. ఆ బిల్లులపై తాను యాక్టివ్‌గానే ఉన్నానని తెలిపారు. ఆ బిల్లుల్లోని కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నదన్నారు. ఆ తర్వాత వాటి గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఎవ్వరూ తనపైన ఒత్తిడి తీసుకురాలేరన్నారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అంటూ తనను ఎవ్వరూ శాసించలేరన్నారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆమె తెలంగాణకు సంబంధించిన ఒక బిల్లును తిరస్కరించడం, మరో రెండు బిల్లులపై ప్రభుత్వం నుంచి వివరణ కోరిన నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read..

పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం

Tags:    

Similar News