బడ్జెట్‌‌పై స్టేట్ ఫైనాన్స్ హోప్స్.. నిధుల కోసం రాష్ట్ర సర్కారు వేసిన ప్లాన్ ఇదే..!

సంక్షేమ పథకాలు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.

Update: 2024-07-22 01:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాలు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. వీటికి ఏటేటా అంచనా వ్యయం పెరుగుతుండడంతో ఆదాయ వనరుల కోసం సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే రీజన్‌తో భూముల విలువలు, మద్యం ధరలు పెంచేందుకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుతుందనే ఆశలు పెట్టుకున్నది. కానీ గడిచిన నాలుగేండ్లుగా అంచనాలకు పొంతన లేకుండా సెంట్రల్ గ్రాంట్స్‌లో కోత పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నది. సంక్షేమానికి కోత పెట్టలేక, సొంత ఆదాయాన్ని పెంచుకోలేక, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందక... అరకొర అమలుతో సరిపెట్టుకున్నది. గత ప్రభుత్వంలో పంటలకు నష్టపరిహారం, రైతుబంధు, దళితబంధు, వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం... ఇలాంటి అనేక పథకాలు నిధులు లేక అమలుకు దూరంగానే ఉండిపోయాయి.

ప్రత్యామ్నాయాలపై ఫోకస్

సొంత ఆదాయ వనరులకు పరిమితులు ఏర్పడడం, సంక్షేమానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీకి నోచకుండా ఉన్న పలు ప్రభుత్వరంగ సంస్థల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని ఫండ్స్ తదితరాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల జాబితానూ సిద్ధం చేసింది. వీటిని సెటిల్ చేయగలగితే రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరుతుందని అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇటీవల రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివాదాల పరిష్కారంపై చర్చించుకున్నారు.

ఫండ్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి

కొన్ని అంశాలు విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖతో ముడిపడి ఉన్నందున అక్కడే సెటిల్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనికి తోడు విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలనే నిబంధన ఉండడంతో వీలైనంతగా ఆర్థిక సాయాన్ని అందించాలని కోరుతున్నది. ప్రతి జిల్లాకూ రూ.50 కోట్ల చొప్పున రాష్ట్రంలోని 9 వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి రూ.450 కోట్లు రావాల్సి ఉన్నదని, నాలుగేండ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నది. ఏపీ జెన్‌కో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రాష్ట్ర విభజన సందర్భంగా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటుకు చెందిన నిధులు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో పొరపాటున ఏపీ ఖాతాలో జమ అయిన డబ్బులను తిరిగి సెటిల్ చేయడం వంటి అంశాలు కొలిక్కి వస్తే కొంత మొత్తం అందుతుందనే ఆశతో సర్కారు ఉన్నది.

కొన్ని పథకాలకు నిధులు బంద్

మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో వాటి ద్వారా రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటి పలు పథకాల ద్వారా వచ్చే నిధులు రాలేదు. గత ప్రభుత్వం చివరి రోజుల్లో ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలవుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్‌కు అనుసంధానం చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని నిర్ణయించుకున్నది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి కొన్ని నిధులు సమకూరే అవకాశం ఉన్నది.

సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా..

ఈ సారి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులు కాస్త పెరగొచ్చని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఫైనాన్స్ డిపార్టుమెంట్ అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం సెకండ్ టర్మ్‌లో కేంద్రంతో రిలేషన్స్ సరిగా పెట్టుకోక పోవడంతో నిధులు రాలేదని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా నిధుల ఇబ్బందులు అధిగమించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్‌షా‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా మోడీని కలిసిన రేవంత్... బడే భాయ్ తరహాలో పెద్ద మనసు చేసుకోవాలని కోరారు.

రూ. 41,259 కోట్లను రూ.13,953 కోట్లకు కుదింపు

గత ప్రభుత్వంలోని సెకండ్ టర్మ్‌లో ఐదేండ్లకుగాను మూడేండ్ల బడ్జెట్ అంచనాల్లో కేవలం మూడవ వంతు మేర నిధులే రాష్ట్రానికి సెంట్రల్ గ్రాంట్స్ రూపంలో అందాయి. అంచనాలకు, వాస్తవాలకు ఉన్న వ్యత్యాసాన్ని, ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 2023-24 అంచనాలను సవరించి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందనుకున్న రూ.41,259 కోట్లను రూ.13,953 కోట్లకు కుదించింది. వాస్తవానికి కేంద్రం నుంచి అందింది రూ.9,729 కోట్లే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ.21,075.15 కోట్లు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. వాస్తవికతకు దగ్గరగా ఉందనే అభిప్రాయంతో గ్రాంట్ల రూపంలో ఈ మొత్తం అందుతుందని ఆశిస్తున్నది.

కేంద్రం నుంచి తెలంగాణ ఆశిస్తున్న నిధులకు సంబంధించిన కొన్ని అంశాలు :

- విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ట్రైబల్ యూనివర్శిటీ మంజూరైనా ఏడు సంవత్సరాల్లో రెండు విడతల్లో రూ.889.07 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నది. వెంటనే ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేయాలి.

- తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాలకుగాను రావాల్సిన రూ.495.02 కోట్లు పొరపాటున ఏపీ ఖాతాలో కేంద్రం జమ చేసింది. దీన్ని తిరిగి తెలంగాణ ఖాతాకు బదిలీ చేయాలి.

- ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ డెట్ (ప్రజారుణం) పద్దు కింద ఎక్సెటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన రూ.17,666.66 కోట్లలో రూ.8,737.29 కోట్లు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగింది. ఇంకా రూ.8,929.37 కోట్లు జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.

- తెలంగాణ, ఏపీ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడినా రాజ్‌భవన్, హైకోర్టు తదితర కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థల సర్వీసులు రెండు రాష్ట్రాలకూ అందినా ఆ సంస్థల నిర్వహణ ఖర్చు మాత్రం పూర్తిగా తెలంగాణ భరించింది. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు రూ.408.48 కోట్లు వస్తాయని ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ 2022 డిసెంబరు 9న లెక్క తేల్చారు. దాన్ని తిరిగి తెలంగాణకు అప్పగించాలి.

- రాష్ట్ర విభజన సందర్భంగా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటుకు చెందిన రూ.208.24 కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉన్నది. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలి.

- ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డుల్లో ఉండిపోయిన నిధులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో పంచాల్సి ఉన్నది. తెలంగాణ వాటాగా రూ.464.91 కోట్లు రావాల్సి ఉన్నది. ఇది అందేలా చూడాలి.

- రాష్ట్ర విభజన సందర్భంగా అనంతపూర్, కర్నూలు జిల్లాల్లోని డిస్కంల రుణభారం తెలంగాణపై పడడంతో సుమారు రూ.24,106 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉన్నది. రెండేండ్ల పాటు ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ వాడుకున్నందున కట్టాల్సిన రూ.6,756 కోట్లను మినహాయించుకుని మిగిలినదాన్ని చెల్లించాలి.

- విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం నాలుగేండ్లకుగాను రూ.1,800 కోట్లను కేంద్రం వెంటనే విడుదల చేయాలి.

Tags:    

Similar News