నాలుగేండ్లుగా నిరీక్షణ.. ప్రమోషన్లకు నోచని ఎస్టీఏ ఉద్యోగులు

స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్హులైన ఎంప్లాయీస్‌కు ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-08-19 03:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్హులైన ఎంప్లాయీస్‌కు ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు డీటీసీలు, ఐదు ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెల చివరిలో ఒక జేటీసీ పోస్టు సైతం ఖాళీ అయ్యింది. అర్హులైన ఏఎంవీఐలు.. ఎంవీఐ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త కమిషనర్ అయినా చొరవ చూపి పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. రవాణాశాఖలో స్టేట్‌ట్రాన్స్‌పోర్టు అథారిటీ కీలకం.

ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో ఇది కూడా ఒకటి. అంతే కాదు రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ అథారిటీ ఉద్యోగులే కీలకం. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాఖను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రమోషన్లు కల్పించలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా అక్కడ ఆర్టీఓ పోస్టులు మంజూరు చేయలేదు. ఎంవీఐలతోనే కాలం వెల్లదీసింది. దీనికి తోడు ఉమ్మడి జిల్లాల్లోని కొన్నింటికి డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని గత ప్రభుత్వం భర్తీ చేయలేదు.

ఖాళీగా పలు డీటీసీ పోస్టులు

రాష్ట్రంలోని నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో డీటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీటీసీ పోస్ట్ ప్రమోషన్ కోసం డజను మంది ఆర్టీఓలు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ జేటీసీగా పనిచేసిన ప్రవీణ్‌రావు సైతం జూలై చివరన ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీని కోసం అర్హులైన డీటీసీలు ఎదురుచూస్తున్నారు. అందు కోసం ఫైల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఐదు ఆర్టీఓ పోస్టులు ఖాళీ

స్టేట్‌లో ఐదు ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గద్వాల, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, కామారెడ్డి, మంచిర్యాలలో ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉండగా అక్కడ ఎంవీఐలతోనే కాలం వెల్లదీస్తున్నారు. అర్హులైన ఎంవీఐలు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నా దానికి సంబంధించిన ఫైల్ మాత్రం ముందుకు కదలటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంవీఐలకు పదోన్నతి వస్తే ఆ స్థానంలో తమకూ అవకాశాలు వస్తాయని ఏఎంవీఐలు ఆశతో ఉన్నారు. ఇప్పటికే సీనియారిటీ లిస్టును ఉన్నతాధికారులు తయారు చేసినట్టు తెలిసింది.

కొత్త జిల్లాలకు సాంక్షన్ కాని పోస్టులు

ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, సంగారెడ్డికి డీటీసీ పోస్ట్ ఉన్నా.. ఆర్టీఓ పోస్టులు సాంక్షన్ చేయలేదు. భూపాలపల్లి, జగిత్యాల, జనగామ, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, రాజన్నసిరిసిల్లా, వనపర్తి, హన్మకొండ, యాదాద్రిభువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాలకు, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు సైతం గత ప్రభుత్వం ఆర్టీఓ పోస్టులు మంజూరు చేయలేదు. కేవలం జిల్లాలు ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం ఎంవీఐలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది.

కమిటీ ఉన్నా చొరవ నిల్ ?

ఏ శాఖలో లేని విధంగా స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఎస్టీఏ)లో ఉద్యోగుల ప్రమోషన్లకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఉన్నది. ఆ కమిటీ దగ్గర ఉద్యోగుల పని తీరుతో పాటు వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ప్రమోషన్లలో ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. ఇంత పకడ్బందీగా వ్యవహరించే ఈ కమిటీ సుమారు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎందుకు చొరవ చూపడం లేదనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఖాళీలు ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులపై అదనపు భారం పడుతున్నా, ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నా స్పందించక పోవడం విమర్శలకు దారి తీస్తుంది.

కొత్త కమిషనర్ చొరవ తీసుకుంటారని ఆశతో..

రవాణాశాఖకు ఇటీవల కొత్త కమిషనర్‌గా ఇలాంబరితికి బాధ్యతలు చేపట్టారు. కమిషనర్ నిత్యం ఉద్యోగుల సమస్యలపై చొరవ తీసుకుంటారని పలువురు చెబుతున్నారు. ప్రమోషన్లపై చొరవ తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.


Similar News