Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్.. భారీ గొయ్యితో పెను ముప్పు
శ్రీశైలం ప్రాజెక్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
దిశ, అచ్చంపేట : శ్రీశైలం ప్రాజెక్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితిపై ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009 అక్టోబరులో కనీవినీ ఎరుగని భారీ ఎత్తున వరదలు వచ్చాయి. డ్యాంకు 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. మళ్లీ ఆ స్థాయి వరద వస్తే డ్యాం తట్టుకుట్టుందా? ప్లంజ్‌పూల్‌లో గొయ్యి వల్ల ప్రాజెక్టు భద్రతకు ముప్పు పొంచి ఉందా? 2009 నాటి వరదలకు ఆనకట్ట సహా కుడి, ఎడమ గట్లు ఏమేరకు దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు చాలా కమిటీలు అధ్యయనం చేశాయి. శ్రీశైలం సహా వివిధ ప్రాజెక్టుల భద్రత, నిర్వహణ లోపాలను సమీక్షించేందుకు కేంద్ర జలవనరుల శాఖ 2014 సెప్టెంబరు 23న ఆయా రాష్ట్రాల ఇంజినీరింగ్ నిపుణులతో సమావేశం నిర్వహించింది. అప్పటి రాష్ట్ర ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ), ప్రస్తుత సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
శ్రీశైలం భద్రతపై అధ్యయనం
ఎం.వెంకటేశ్వరరావు, కన్వీనర్ సభ్యులు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ విశ్వేశ్వరరావు, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ భూపాల్ సింగ్, ప్రాజెక్టు డిజైన్ డైరెక్టర్ ఎస్‌కే సిబాల్, ఫౌండేషన్ ఇంజినీరింగ్ డైరెక్టర్ వీఆర్‌కే పుల్లై, సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ (సీ డీఓ) సీఈ గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ కేవీ సుబ్బారావు, తెలంగాణ క్వాలిటీ కంట్రోల్ సీఈ ఎం.కృష్ణారావు సభ్యులుగా నిపుణుల క మిటీని నియమించారు. ఈ కమిటీ అదే ఏడాది అక్టోబరు 28న ప్రాజెక్టును పరిశీలించి.. డ్యాం భద్రత కోసం తీసుకోవాల్సిన చ ర్యలపై నివేదిక ఇచ్చింది. 2017 జూలై 13న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి నేతృత్వంలోని కమిటీ, 2018 జూన్ 11, 12న జలవనరుల శాఖ రిటైర్డ్ ఈఎన్‌సీ పి.రామరాజు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, రిటైర్డ్ ఈఈ కె.కృష్ణ కమిటీ, 2020 ఫిబ్రవరి 25న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్, డ్యాం భద్రతా నిపుణుడు ఏబీ పాండ్యా నేతృత్వంలో కేంద్ర నిపుణుల కమిటీ డ్యాంను పరిశీలించాయి. ప్లంజ్‌ఫూల్‌లో భారీగొ య్యి వల్ల డ్యాంకు ముప్పు పొంచి ఉందని తేల్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీ
ఈ ఏడాది ఫిబ్రవరి 8న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) చైర్మన్ వివేక్ త్రిపాఠి నాయకత్వంలో ఎన్‌డీఎస్ఏ సభ్యులు, కేంద్ర జలసంఘం, కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ ఎస్) నిపుణులు, ఏపీ, తెలంగాణ ఇంజినీర్ల కమిటీ సభ్యులు శ్రీ శైలం జలాశయాన్ని సందర్శించారు. ఆనకట్ట స్పిల్‌వే గేట్ల నుంచి అతివేగంగా కింద పడే వరద మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్‌ఫూల్)లో ఏర్పడిన భారీ గొయ్యిని పరిశీలించారు. ఈ గొయ్యి 45 మీటర్లు లోతు, 270 మీటర్లు వెడల్పు, 400 మీటర్లు పొడవు ఉంటుందని అంచనా వేశారు. ప్లంజ్‌ఫూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యితో డ్యాం భద్రతకు, ప్రాజెక్టు రెండు వైపులా ఉన్న గట్లు, ఆనకట్ట పునాదిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇప్పటికే నష్టం జరిగిన ప్రొటెక్షన్ సిలిండర్స్ రిహాబిటేషన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేంద్రం నిధుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు?
శ్రీశైలం ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల కోసం ‘డ్యాం రిహాబిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం’ (డ్రిప్-2) కింద రూ.139 కోట్లు ఇవ్వాలని ఇంజినీర్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు ఇవ్వకపోగా పలు కొర్రీలు పెట్టింది. రూ.190 కోట్లతో మరో ప్రతిపాదన పంపిస్తే దానినీ ఆమోదించలేదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డాక్టర్ హ్యానిశ్ శాలం, అభిషేక్ కుమార్ నెల రోజుల క్రితం శ్రీశైలం డ్యాంను సందర్శించారు. డ్యాం భద్రతకు రూ.203 కోట్లు నిధులు కావాలని కోరుతూ తాజాగా మరో ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు కర్నూలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్ బాషా తెలిపారు.