జగన్‌తో దోస్తీకి కేసీఆర్ ఆసక్తి.. ?

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దాదాపు వంద మందిని బరిలోకి దింపేందుకు....Special Story Over BRS of KCR

Update: 2022-12-11 02:07 GMT

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 100 స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో దోస్తీ కట్టే పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక‌పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తున్నది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏపీలోనూ వైసీపీతో కలిసి నడవాలని భావిస్తున్నారు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలనే అవకాశంగా మలుచుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దాదాపు వంద మందిని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో కలిసి వచ్చే పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలనే గులాబీ బాస్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంతలోపు పార్టీ విధానాలు ఖరారు చేసి.. జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.

జేడీఎస్, శివసేనతో దోస్తీ

ముందుగా దక్షణాది రాష్ట్రాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. అందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు చాన్స్ ఉందని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ మంత్రి తెలిపారు. 'కర్నాటకలో 28 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అక్కడ జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తాం. మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. అక్కడ శివసేనతో కలిసి పోటీకి దిగుతాం. తెలంగాణలోని 17 స్థానాల్లో ఎలాగు పోటీ చేస్తాం. ఇలా దాదాపుగా 100 స్థానాల్లో బీఆర్ఎస్ తరుపున అభ్యర్థులను పోటీకి దింపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. శివసేన, జేడీఎస్.. కాంగ్రెస్ తో దోస్తీ పెట్టుకుని పరిస్థితి లేదు. అదే మాకు మంచి చాన్స్' అని ఆ మంత్రి వివరించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

వచ్చే ఏడాది మార్చిలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మాత్రమే పోటీ చేయనున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి అన్ని రకాలుగా సపోర్టు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు టాక్. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి జేడీఎస్ నేత కుమారస్వామి వచ్చినట్టు సమాచారం.

జగన్‌తో కలిసి?

ఏపీలో జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో వైసీపీ, బీజేపీ మధ్య ఉండే స్నేహం ఆధారంగా నిర్ణయం ఉంటుందని పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఒకవేళ జగన్.. బీజేపీతో విభేదిస్తే ఆయనకు బీఆర్ఎస్ సపోర్టు ఇస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీతో కలిసి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.


Similar News