ప్రభుత్వ ప్రక్షాళనకు రంగం సిద్ధం.. మూడు రోజుల్లో మార్పులు షురూ..!
ఆరు గ్యారంటీలను కేవలం వంద రోజుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ టాస్క్ పెట్టుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారంటీలను కేవలం వంద రోజుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ టాస్క్ పెట్టుకున్నది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించగా, మిగతా గ్యారెంటీలను అతి త్వరలో మొదలు పెట్టాలని పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. గ్యారెంటీలకు అవసరమైన బడ్జెట్, క్షేత్రస్థాయిలో పేదలకు అందించేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై ఐఏఎస్ ఆఫీసర్లు ప్రత్యేకంగా ప్రణాళికను రూపకల్పన చేయనున్నారు.
ఇందుకోసం సీఎం తన మైండ్‌లో కొందరు ఐఏఎస్ అధికారుల పేర్లను ఫిక్స్ చేసినట్లు సచివాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు రిలీజ్ చేయనున్నారు. ఆరు గ్యారెంటీల స్కీమ్‌లు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కావున స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలే ప్రధానంగా ఉపయోగపడ్డాయని నేతలు విశ్వసిస్తున్నారు. దీంతో ఆయా గ్యారెంటీలను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించేందుకు కీలక ఐఏఎస్‌లకు బాధ్యతలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన ఉండాలనే లక్ష్యంతో సీఎం ముందుకు వెళ్తున్నారు. దీంతో కొత్త నిర్ణయాలతో పాలనను ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో రిటైర్డ్ అధికారులకు ఎక్కువ ప్రయారిటీ లభించిందని కాంగ్రెస్‌తో పాటు మిగతా అధికారులు గతంలో ప్రచారం చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు కురిపించారు. దీంతో ఇప్పుడు రిటైర్డ్ అధికారులకు పదవులు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో సీఎం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు హెచ్‌వోడీల స్థాయిలోనూ రిటైర్డ్ అధికారులు ఉండకూడదని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మంత్రులకు ఓఎస్డీలు విధులు నిర్వర్తించేందుకు చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ అంశం సైతం సీఎం దృష్టికి వెళ్లింది. సర్వీసుల్లో ఉన్నోళ్లకే పోస్టులు ఇవ్వాలని సీఎం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. రిటైర్డ్ అధికారులతో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం నడుపుతున్నాడని టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వ వాసన లేకుండా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేయాలని సిద్ధం కావడం గమనార్హం. కేసీఆర్ సర్కార్‌లో అనుకూలంగా పనిచేసిన సివిల్ సర్వీస్ అధికారులను పక్కకు జరిపి, కొత్తోళ్లకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ రూపకల్పన చేస్తున్నది.
గత స్కీమ్‌ల తరహాలో ఫెయిల్ కాకుండా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు, బీసీ బంధు వంటి స్కీమ్‌లు సక్సెస్‌ఫుల్‌గా అమలు కాలేదనే విమర్శలు ప్రజల నుంచి విస్తృతంగా వచ్చాయి. పైగా లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో కమీషన్ల పర్వం కొనసాగింది. దీన్ని స్వయంగా కేసీఆరే అంగీకరించినట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఆరు గ్యారెంటీల్లో ఇలాంటి సిచ్వేషన్ రాకూడదని సీఎం రేవంత్ రెడ్డి రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని భావిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల కనుసన్నల్లోనే స్కీమ్‌లు అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. స్కీమ్‌ల పరిస్థితిపై ప్రజలే నేరుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.