దేవాలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు : మంత్రి కొండా సురేఖ

దేవాలయాలకు చెందిన 231 ఎకరాల భూముల్లో తొలి విడుతలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

Update: 2024-10-18 15:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేవాలయాలకు చెందిన 231 ఎకరాల భూముల్లో తొలి విడుతలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. దేవాదాయ భూములను సర్వే చేసి సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 34 వేల 92 ఎకరాల దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. 57 శాతం దేవాదాయ భూములను ధరణిలో నిక్షిప్తం చేయడంతో పాటు ఇతరులు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయ భూములను క్రమబద్ధంగా రికార్డు చేయడం జరుగుతున్నదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆలయ భూముల వివరాలను తెలుపుతూ స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చామని 4 జిల్లాల్లో పనులు పూర్తయ్యాయన్నారు. దేవాదాయ శాఖ భూములను సర్వే చేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి యాదాద్రి ఆలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం చేస్తున్నామని తెలిపారు. దాతలచే సేకరించిన 15 కోట్ల విరాళంతో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, దీంతో రోజుకు సూమారు 2500 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు. అదే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు షెడ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణకు 60 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటితో పాటు వేములవాడ, భాసర వంటి ప్రముఖ ఆలయాల అభివద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని దేవాలయాల వెబ్ సైట్ లను ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చి దేవాదాయ శాఖ సమగ్ర వెబ్ సైట్ ను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో దేవాదాయ శాఖ యాప్ ను ఏర్పాటు చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా భక్తులు తమకు ఇష్టం వచ్చిన దేవాలయాల వివరాలు స్థల పురాణాలు తెలుసుకునే వీలు కల్పిస్తామని వెల్లడించారు.

ఆలయాల్లో గత 15ఏళ్లుగా పనిచేస్తున్నవారిని బదిలీ చేశామని, ఇది దేవాదాయ శాఖచరిత్రలోనే ఇది రికార్డు అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 వచ్చిన తర్వాత జోనల్ సిస్టమ్ ప్రకారం సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించుకున్నామని, ఇందులో భాగంగా నవంబర్ 2022లో ప్రాథమిక నోటిఫికేషన్ ను ఇచ్చామని, 9 జూలై 2024న ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి.. దీని ప్రకారం 33 మంది నాన్ గవర్నమెంట్ దేవాదాయశాఖ ఉద్యోగులను గ్రేడ్ 3 ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో బోనాల జాతరను అత్యంత వైభవోపేతంగా చేపట్టామన్నారు. సమ్మక్క సారక్క జాతరను 2024లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, భద్రాచలం కళ్యాణం ఉత్సవాలకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చామని, దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కావాల్సిన నెయ్యి, ఇతర అంశాలకు సంబంధించి క్రమబద్ధంగా టెండర్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, అధికారులు పాల్గొన్నారు.


Similar News