Social Media Target ! గట్టెక్కెందుకు పాలి'ట్రిక్స్'
ప్రభుత్వం తాము చేసిన పనిని ప్రచారం చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంను విస్తృతంగా వినియోగిస్తున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం తాము చేసిన పనిని ప్రచారం చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. సీఎంవో నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి నలుగురికి తెలిస్తేనే కదా ఓట్లు రాలేది అందుకే సోషల్ మీడియా ప్రస్తుతం అత్యవశ్యకమైంది. ఇదే సోషల్ మీడియా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం తమ ప్రభుత్వానికి హాని చేస్తుందని అధికార పార్టీ పసిగట్టింది. అందుకే ఆ ప్లాట్ ఫాంపై నిఘా ఉంచింది.
స్పెషల్ ఫోకస్..
వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరేం షేర్ చేస్తున్నారు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో వంటి వాటిని నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలే ప్రధాన ఎజెండా పోస్టులు పెట్టేందుకు టీంలను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహకర్త టీం ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్టులు వివాదాస్పదం కావడంతో సైబర్ క్రైం పోలీసులు కార్యాలయంపై దాడులు చేసి సునీల్ కనుగోలు, సిబ్బందిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులపై కేసులు కొత్తమీ కాదు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్, తీన్మార్ మల్లన్న, మహిపాల్ యాదవ్‌లాంటి వారిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర ముఖ్యనేతలపై అసభ్యపదజాలంతో దూషణలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ దృష్టి సారించింది. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియజేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. చట్టపరమైన చర్యలతో పాటు ఆయా సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అవకాశాలను కూడా వినియోగించి అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలను బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేయాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచించింది.
ఎలక్షన్ మూడ్.. పార్టీలు యాక్టివ్
ఎలక్షన్స్ సమీపిస్తున్నందున ప్రధాన పార్టీలు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాయి. ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాను ప్రధానంగా వాడుతున్నాయి. సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కాంలో వినబడటంతో ఈ అంశాన్ని అన్ని పార్టీలు ప్రధానంగా వాడుతున్నాయి. అనేక వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇటీవల మంత్రులపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గత ఏనిమిదిన్నరేళ్లుగా అక్రమాస్తులు కూడగట్టారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఒకే సారి లక్షల మందికి కీలక విషయాలను చేర్చడంలో భాగంగా ఆయా పార్టీలు ఈ వేదికను కీలకంగా మార్చుకుని ముందుకు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రజలకు కలుగుతున్న నష్టం వంటి అంశాలను లెక్కలతో సహా ఎత్తి చూపుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఈ సోషల్ మీడియా పోస్ట్‌లు ఏ మేరకు ప్రభావం చూపుతాయోననే టెన్షన్ అధికార పార్టీలో మొదలైంది. అందుకే ఈ అంశాన్ని టీఆర్ఎస్ పెద్దలు సీరియస్‌గా తీసుకుని వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. మరి రానున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా వేదికలు రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే..
Also Read..