‘కారు’ దిగనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్

‘కారు’కు పంక్చర్ చేసి కాంగ్రెస్‌తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు.

Update: 2024-07-12 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కారు’కు పంక్చర్ చేసి కాంగ్రెస్‌తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో ‘హస్తం’ కండువా కప్పుకోనున్నారు. గతంలోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ప్రకాశ్ గౌడ్‌ను పిలుచుకుని పార్టీ మారొద్దని బుజ్జగించారు. కానీ ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.

గ్రేటర్ నుంచి మరో ఐదుగురు జంప్?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్‌చార్జి మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.

తగ్గుతున్న బీఆర్ఎస్ బలం

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాశ్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కు చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ కారు పార్టీ పెద్దలకు పట్టుకున్నది.


Similar News