సిట్టింగ్‌లకే పట్టం.. కొత్తగా ఇద్దరికి ఛాన్స్!
ఓరుగల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్లు పదిలమయ్యాయి.
దిశ, వరంగల్ బ్యూరో : ఓరుగల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్లు పదిలమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోమారు సీట్లను కేటాయింపు చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గానికి మినహా మిగిలిన 11 అసెంబ్లీ సెగ్మంట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం ముఖ్యమంత్రి షాకిచ్చారు.
ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కడియంకు అవకాశం కల్పించారు. అలాగే ములుగు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతికి కొత్తగా అవకాశం కల్పించడం విశేషం. ఇక జనగామ నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. జనగామ సీటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కన్ఫార్మ్ అయినట్లుగా వార్తలు వినిపించినా పెండింగ్‌లో ఉంచారు. వాస్తవానికి ఎమ్మెల్సీ కవితను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కలిసిన తర్వాత ఈ మార్పు జరిగి ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యేలు..
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ అధిష్టానానికి నివేదికలు అందినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ ఉంటుందన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతల నుంచి సైతం వినిపించింది. అయితే అనూహ్యంగా కేసీఆర్ 11 సిట్టింగ్ సీట్లలో 9మందికి మళ్లీ అవకాశం కల్పించి రాజకీయ వర్గాలను సైతం విస్మయపరిచారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ టికెట్ విషయంలో సేఫ్‌గా ఉన్నట్లుగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను అనుసరించి అర్థమైంది.
అయితే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌కు, మహబూబాబాద్ లో శంకర్‌నాయక్‌కు, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, జనగామలో ముత్తిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యకు ముప్పు కత్తి వేలాడింది. అయితే రాజయ్యకు షాకిచ్చినా మిగతా వారిపై మాత్రం కేసీఆర్ కరుణే చూపారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంతో సిట్టింగ్ సీట్లను దక్కించుకున్న ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఆశావహుల్లో నైరాశ్యం..
ఆరునూరైనా ఈసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలని పావులు కదిపిన ఆయా నియోజకవర్గాల బీఆర్ ఎస్ నేతలకు సిట్టింగ్‌లకే సీట్ల పాలసీ తీవ్ర నిరాశను మిగిల్చింది. వారి అనుచరుల్లో నైరాశ్యం కలిగిస్తోంది. డోర్నకల్ నుంచి టికెట్ ఆశించిన మంత్రి సత్యవతి, మహబూబాబాద్ నుంచి ఎంపీ కవిత, పరకాల నుంచి నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ తూర్పు నుంచి మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సారయ్య, అలాగే భూపాలపల్లిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్లు ఆశించారు. అయితే కేసీఆర్ నిర్ణయంతో నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎవరో చేసిన కుట్రలకు రాజయ్యను బలి చేశారన్న వాదనను వినిపిస్తున్నారు.
Read More : ముగ్గురు ఎస్టీ సిట్టింగ్‌లకు BRS షాక్!.. వారి వ్యూహమిదేనా?