గ్రూప్-1 పేపర్ లీక్ చేసింది అతడే.. పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు నిజం!

గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి అమ్మినట్టు నిర్ధారణ అయ్యింది.

Update: 2023-03-20 06:17 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి అమ్మినట్టు నిర్ధారణ అయ్యింది. సిట్ విచారణలో నోరు తెరిచిన రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నపత్రాలను కూడా లీక్ చేసినట్టు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. వచ్చిన డబ్బును బంధువులు, స్నేహితుల అకౌంట్లలో జమ చేసినట్టు వెల్లడించాడని తెలిసింది. అక్టోబర్‌లోనే టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ రూంలోని కంప్యూటర్ నుంచి తస్కరించినట్టు రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. ఈ ప్రశ్నపత్రాన్ని కరీంనగర్‌కు చెందిన ఆరుగురికి అమ్మినట్టు వెల్లడించాడని తెలిసింది.

వీరిలో ఇద్దరు ఎన్నారైలు ఉన్నారని చెప్పినట్టు తెలియవచ్చింది. మరికొందరికి కూడా ఈ ప్రశ్నపత్రాలను అమ్మినట్టు చెప్పిన రాజశేఖర్ రెడ్డి.. గ్రూప్- 1 పరీక్ష రాసిన ప్రవీణ్ కూడా తన నుంచే పేపర్ తీసుకున్నాడని వెల్లడించినట్టు సమాచారం. ఆ తరువాత ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని రేణుక ద్వారా ఇంకొందరికి అమ్మినట్టుగా చెప్పాడని తెలిసింది. అక్టోబర్ నుంచే ప్రశ్నపత్రాలు తస్కరిస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఏడు పరీక్షలపై సిట్ అధికారులు దృష్టి సారించారు.

ఈ పరీక్షల్లో టాప్ మార్కులు సాధించిన 500 మంది జాబితాను రూపొందించినట్టు సమాచారం. వీరందరిని ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన ఇద్దరు ఎన్నారైలను కూడా పిలిపించి విచారించనున్నట్టు సమాచారం. అక్టోబర్‌లో జరిగిన గ్రూప్- 1 పరీక్ష ప్రశ్నపత్రం లీకయినట్టు ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో దీని విషయమై సిట్ అధికారులు తమదైన శైలిలో రాజశేఖర్ రెడ్డిని విచారించారు. ఈ క్రమంలో పేపర్‌ను సంగ్రహించి కరీంనగర్‌కు చెందిన ఆరుగురితో పాటు మరికొందరికి అమ్మినట్టు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.

Tags:    

Similar News