Fire Accident: నెల్లికుదురు పిహెచ్‌సి సబ్‌స్టోర్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్
తెలంగాణాలో తరుచు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ నెల్లికుదురు: తెలంగాణాలో తరుచు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆరోగ్య కేద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సబ్ స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది.
దీనితో రూమ్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి పిహెచ్సి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నిన్న రాత్రి ఆసుపత్రి సిబ్బంది మెడిసిన్ కోసం స్టోర్ రూమ్ కి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు లైట్ అలానే ఫ్యాన్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యాన్ లో నుంచి మంటలు వచ్చాయని పేర్కొన్నారు. కాగా అది స్టోర్ రూమ్ కావడంతో అక్కడ ఉన్న మెటీరియల్ అట్టలకు మంటలు అంటుకుని వ్యాపించాయి అని అన్నారు.
దీనితో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారని వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో రూ. 60 వేల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.