ఆర్ఎస్ ప్రవీణ్ కు పొలిటికల్ డ్రీమ్ పై నీళ్లు.. ఆ మాజీ ఎంపీ ఎంట్రీతో సీన్ రివర్స్!
ఎంపీ ఎన్నికల వేళ వలసలు, చేరికలతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎంపీ ఎన్నికల వేళ వలసలు, చేరికలతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానంలో రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు తాజా రాజకీయ సమీకరణాల్లో మార్పులే కారణం అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఓ మాజీ ఎంపీ ఎత్తుగడతో ఆర్ఎస్పీ విజయానికి గండి పడబోతున్నదా? ఇప్పుడిదే నాగర్ కర్నూల్ పొలిటికల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆశలు అడియాసలేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో విమర్శలతో తూర్పారబట్టిన ఆర్ఎస్పీ కేసీఆర్‌తో చేతులు కలిపి పొత్తు ప్రతిపాదన చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్‌లో చేరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు, బీఎస్పీ ఓట్లు తోడైతే కలిసి వస్తుందని గెలుపుపై ధీమాతో ఉన్న ఆయనకు తాజా పరిణామాలు షాకిస్తున్నాయి. ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరడం పట్ల గుర్రుగా ఉన్న తన సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు జరుపుతుండగా అనూహ్యంగా సీనియర్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రవీణ్ కుమార్ ఇది పెద్ద ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీఎస్పీ కేడర్ గుస్సా...
మరోవైపు ఆర్ఎస్పీకి అధ్యక్షుడిగా సముచిత స్థానం కలిపిస్తే కీలక సమయంలో పార్టీని వీడి అన్యాయం చేశారని బీఎస్పీ కేడర్ సైతం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత మందా జగన్నాథంను బరిలో నిలిపి ఆర్ఎస్పీకి షాక్ ఇవ్వాలని బీఎస్పీ సైతం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఓట్లతో పాటు బీఎస్పీ ఓట్లు కూడా తనకు కలిసి వస్తాయని భావించిన ఆర్ఎస్పీకి మంద జగన్నాథం ఎఫెక్ట్ తప్పదా అనే ప్రచారం జరుగుతోంది.
సర్వేలోనూ వెనుకబడిన ఆర్ఎస్పీ..
ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ నుంచి మల్లురవి బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపడుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన జన్ లోక్ పోల్ సర్వేలో ఇక్కడ ఆర్ఎస్పీ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు అంచనా వేసింది. ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో ఉన్న భరత్ ఇటీవలే తన తండ్రితోపాటు బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లను ఆయన కొంతవరకు చీల్చగా, బీఎస్పీ నుంచి మంద జగన్నాథం దళిత ఓట్లను చీల్చితే ఆర్ఎస్పీకి పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
Read More..
BRS ఎంపీ అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. వణికిస్తున్న ఆ రెండు అంశాలివే..!