రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోన్న షర్మిల సడెన్ డెసిషన్.. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్న విపక్ష పార్టీలు సడెన్‌గా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటం చేద్దామనే నిర్ణయానికి రావడం హాట్ అవుతోంది. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పని చేద్దామంటూ తాజాగా షర్మిల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
ఉమ్మడిగా పోరాటం చేసేందుకు షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు రేవంత్ రెడ్డి సైతం పార్టీలో చర్చించాక అభిప్రాయం చెబుతామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో ఉమ్మడి పోరాటం చేసేందుకు షర్మిల చేస్తు్న్న ప్రయత్నంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ముందుండి నడిపేదెవరు?:
షర్మిల ప్రయత్నం సక్సెస్ అయి బీజేపీ, కాంగ్రెస్, వైస్సార్ టీపీ ఏకం అయితే గనుగ వీరు చేసే పోరాటాలను ముందుండి నడిపించేది ఎవరూ అనేది ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌ను ఎదురించేంది మేమంటే మేమే అని బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రకటనలు చేసుకుంటున్నాయి. మరో వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ, కోదండరామ్ పార్టీలు సైతం ప్రభుత్వంపై ఐక్యంగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవలే కోదండరామ్, ఆర్ఎస్పీ భేటీ అయి ప్రభుత్వ వ్యతిరేక ప్రజా పోరాటాలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ లకు ఫోన్ చేసి కలిసి నడుద్దామనే ప్రతిపాదన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బీజేపీతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ షర్మిల పిలుపుతో కలిసి నడుస్తుందా అనేది అనుమానమే. అయినా నిరుద్యోగుల సమస్యపై కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తే ఈ పోరాటానికి ఎవరు సారథ్యం వహిస్తారనేది అసలు సమస్యగా మారే అవకాశం ఉంది. ముందుగా చొరవ తీసుకున్న కారణంగా షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్‌లు నడుస్తాయా లేక మీ వెంట నడవడం వీలు కాదంటూ ఆదిలోనే వెనక్కి తగ్గుతారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కలిస్తే లాభం ఎవరికి? నష్టం ఎవరికి?:
బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం విషయంలో షర్మిలతో కలిసి నడిస్తే తమ పార్టీలకు లాభమా నష్టమా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటంలో బీజేపీతో కలిసి పని చేయాల్సి రావడమే కాంగ్రెస్‌కు ప్రధాన అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తు్న్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తమ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురి చేస్తోందనేది కాంగ్రెస్ వాదన. ఈ అంశంలో బీజేపీ కార్నర్ చేసేందుకు జాతీయ స్థాయిలో కార్యచరణ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీతో కలిసి పోరాటం చేస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళుతాయనేది కూడా ఆ పార్టీ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.