జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాతో ఏకమవుదాం: షర్మిల కీలక పిలుపు

రాష్ట్రంలోని నిరుద్యోగుల భవిష్యత్ కోసం పార్టీల జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో కలిసి పని చేద్దామని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు.

Update: 2023-04-03 11:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగుల భవిష్యత్ కోసం పార్టీల జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో కలిసి పని చేద్దామని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. యువత ప్రయోజనాల కోసం T-SAVE(తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీన్ అండ్ ఎంప్లాయిమెంట్) పేరుతో అందరం కలిసి ఒక ఫోరంగా ఏర్పాటు అవుదామని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు.

ఈ ఫోరంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రాతినిథ్యం ఉండాలని ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల.. టీ-సేవ్‌లో ప్రతిపక్ష పార్టీలన్నింటికీ సమాన హక్కులు ఉంటాయని.. దీనికి ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదన్నారు. తన వరకు కోదండరామ్ అధ్యక్షుడిగా ఉండి ముందుకు నడిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఎవరి నేతృత్వంలో ముందుకు వెళ్లాలనే దానిపై ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై నిర్ణయం తీసుకుందామన్నారు. ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగివస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు సైతం నిరుద్యోగుల కోసం ఈ పోరాటంలో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షాలుగా ప్రజల పక్షాన కొట్లాడుదామని అన్నారు. కేసీఆర్ సెకండ్ టర్మ్‌లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ కొడుకు, బిడ్డకు పదవులు ఉండాలి, కనీస అర్హత లేని వాళ్లు మంత్రులు అవుతున్నారు. కానీ పేద ప్రజల పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు.

ఎలక్షన్ ఇయర్‌లో భర్తీ చేస్తామని చెప్తే నమ్మడానికి పిచ్చోళ్లమా? ఇన్నాళ్లు కాలయాపన చేసి 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడానికి సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలు లేవని సీఎం పచ్చి అబద్దాలు చెప్తున్నాడని.. రాష్ట్రంలో 8వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా అని నిలదీశారు. రైతులపాలిట కేసీఆర్ ఒక రాక్షసుడు. కేసీఆర్ ఒక ద్రోహి. రైతులను అప్పుల పాలు చేశారు. బ్యాంకుల వద్ద మోసగాళ్లను చేశాడు. అన్ని సబ్సిడీ పథకాలు బంద్ పెట్టి రూ.5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News