టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: ఈడీ విచారణకు రాని శంకర్లక్ష్మి
విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసు ఇచ్చినా టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగిని శంకర్లక్ష్మి రాలేదు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసు ఇచ్చినా టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగిని శంకర్లక్ష్మి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు విచారణకు రాలేకపోతున్నట్టు ఆమె ఫోన్‌ద్వారా ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను ప్రశ్నించటానికి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్ జరిగినట్టుగా భావించిన ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోర్డులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంఛార్జీగా ఉన్న శంకర్లక్ష్మితో పాటు మరో ఉద్యోగి సత్యనారాయణను గురు, శుక్రవారాల్లో విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో శంకర్లక్ష్మి బుధవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆమె రాలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని శంకర్లక్ష్మి ఫోన్‌ద్వారా ఈడీకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖ్ర్రెడ్డిలను విచారిస్తే కీలక వివరాలు వెలుగు చూస్తాయని భావించిన ఈడీ అధికారులు వారిని విచారించటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటీషన్‌దాఖలు చేశారు. జైల్లోనే వారిని విచారిస్తామని పేర్కొంటూ వీడియో కెమరాలు ఇతర ఎలక్ర్టానిక్పరికరాలను లోపలికి తీసుకెళ్లేలా జైలు సూపరిండింటెంట్కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటీషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది.