ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్'

బాలికల సాధికారత కోసం సేవా భారతి తెలంగాణ సంస్థ 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' కార్యక్రమాన్ని చేపట్టింది.

Update: 2023-02-12 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని గచ్చిబౌలిలో బాలికల సాధికారత కోసం సేవా భారతి తెలంగాణ సంస్థ 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా సాగింది. బాలికల వికాసంపై అవగాహన కల్పించడానికి 7వ ఎడిషన్‌ కింద 21కే, 10కే, 5 కే రన్ ను నిర్వహించారు. ఈ రన్ ను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, పోలీస్ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, అఖిల భారత సేవా భారతి ప్రధాన కార్యదర్శి రేణు పాఠక్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో పలువురు కార్పొరేట్లు, వారి కుటుంబసభ్యులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన నిర్వాహకులు, విద్యార్థులు దాదాపు పదివేల మందికి పైగా పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్ల రన్ సాగింది.


ఆపై సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు, తిరిగి స్టేడియానికి చేరుకునే వరకు 21కే రన్ సాగింది. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. బాలికలు, స్త్రీల సాధికారతకు సేవా భారతి స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. సేవాభారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ప్రభాల మాట్లాడుతూ.. 300 కిశోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లోని 6,700 మందికి అండగా ఉంటున్నాయని తెలిపారు. ఈ రన్ ద్వారా మరో 500 కిశోరి కేంద్రాలను విస్తరిస్తూ 10 వేల మందికి చేయూతనిందించనున్నట్లు వెల్లడించారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రన్ లో వినూత్న, చంద్ర శేఖర్ రెడ్డి, రాహుల్ భాటియా తదితరులు పాల్గొన్నారు. కాగా ఇన్ఫోసిస్, జీఈపీ, జెన్‌ప్యాక్ట్‌ సంస్థల ప్రతినిధులు, యశోద హాస్పిటల్స్, టెక్‌వేవ్, సినోప్సిస్, పెగా సిస్టమ్స్, గ్లోబల్‌లాజిక్, హెల్త్‌ఎడ్జ్, 91 సిగ్నేజ్‌, ఇన్నోవా సొల్యూషన్స్ వంటి సంస్ధలు రన్‌కి భాగస్వామ్య మద్దతునిచ్చాయి.

ఇవి కూడా చదవండి :ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' 

Tags:    

Similar News