తెలంగాణ టీడీపీ సంచలన నిర్ణయం

టీడీపీ మరోసభ నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. తెలంగాణలో టీడీపీ లేదు అనేవారికి ఖమ్మం సభ

Update: 2023-01-08 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ మరోసభ నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. తెలంగాణలో టీడీపీ లేదు అనేవారికి ఖమ్మం సభతో చెప్పగా, అధికారంలోకి వస్తామని, పార్టీ సత్తాను చాటేందుకు నిజామాబాద్ సభలో నిరూపించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నది. లక్షమందితో సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. జిల్లా విస్తృతస్థాయి సమావేశంతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సభకోసం కమిటీ ఏర్పాటులో నిమగ్నమైంది. జనవరి చివరివారంలో సభను నిర్వహించేందుకు రెఢీ అయింది. సభ తేదీని సైతం అధికారంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముమ్మర కసరత్తు

రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. సమావేశాలు, సమీక్షలు నిర్వహించడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరపత్రాల పంపిణీ చేపట్టింది. అందులో భాగంగా అన్ని అనుబంధ కమిటీలతో గ్రామస్థాయినుంచి కార్యక్రమాల స్పీడ్‌కు పార్టీ శ్రేణులకు ప్రణాళికలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు, కేడర్‌కు భరోసా కల్పించేందుకు సభలపై అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగానే జనవరి చివరివారంలో నిజామాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని భావిస్తుంది. ఖమ్మం సభకంటే నిజామాబాద్ సభకు ఎక్కువ మందిని తరలించేలా చర్యలు చేపట్టింది. లక్షమందికి పైగా సభకు తరలివచ్చేలా చూడాలని ఇప్పటికే నాయకులకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ప్రచారవాహనాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నది.

సమీక్షా సమావేశాలు

పార్టీకి పట్టున్న జిల్లాలపై అధిష్టానం దృష్టి సారించింది. నిజామాబాద్‌లోనే సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. సభ విజయవంతానికి రెండుమూడ్రోజుల్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. అదేవిధంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలతో పాటు పార్టీ స్థితిపై తెలుసుకోనున్నారు. గతంలో పార్టీ మారిన వారిపై సైతం చర్చించే అవకాశం ఉందని పార్టీలోని ఓ కీలక నేత తెలిపారు. వారిని తిరిగి పార్టీలోకి చేర్చకొని కీలక పదవులు, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. అంతేగాకుండా సభ విజయవంతానికి త్వరలోనే కమిటీలను సైతం వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఎప్పుడు నిర్వహించేది మాత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత తేదీని నిర్ణయించనున్నట్లు సమాచారం.

సీనియర్ నేతలకు టికెట్‌పై భరోసా

ఒకవైపు సభలు.. మరోవైపు రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నది. ఇప్పటి వరకు కేడర్‌లో నైరాశ్యం ఉండటంతో దానిని సభలతో పోగొట్టడంతో పాటు కొంతమంది సీనియర్ నేతలకు టికెట్‌పై భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కొన్ని కమిటీలను సైతం సమావేశాల్లోనే ప్రకటిస్తూ బాధ్యతలను అప్పగిస్తున్నారు. వెంటనే ఆ కమిటీలకు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోకి కేడర్ ఎక్కువగా టీడీపీ నుంచి వెళ్లినవారే ఉండటంతో వారిపై ఫోకస్ పెట్టారు. వారితో మంతనాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ సభతో మరోసారి టీడీపీ సత్తా చాటేందుకు అధిష్టానం సిద్ధమైంది.

సభలతో సత్తా చాటుతాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగసభ సభలు నిర్వహించి టీడీపీ సత్తా ఏమిటో నిరూపిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ నిజామాబాద్ తర్వాత మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో సైతం సభలు నిర్వహిస్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం తేవడంతోపాటు రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా టీడీపీ వెంటనే ఉన్నారని త్వరలోనే వారిసత్తా ఏమిటో చూపుతామన్నారు. సమావేశంలో టీడీపీ సమన్వయకర్త కంభంపాటీ రాంమోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, కాశీనాథ్, నర్సిరెడ్డి, యాదాగౌడ్, పైడి గోపాల్ రెడ్డి, జీవీజీ నాయుడు, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News