CM Revanth Reddy: మెజారిటీ, మైనారిటీ రెండు కళ్లలాంటివారు: సీఎం రేవంత్ రెడ్డి
ఈ దేశంలో రెండే వర్గాలు ఉన్నాయని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మెజారిటీ, మైనారిటీ ప్రజలు ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం మా ప్రభుత్వం అహర్నిశళు శ్రమిస్తున్నదని చెప్పారు. సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Abul Kalam Azad) పుట్టినరోజు సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ దేశంలో 2 వర్గాలే ఉన్నాయని ఒకటి మోడీ వర్గం మరొకటి గాంధీ వర్గం అన్నారు. స్వాయంత్య్రం రాగానే మౌలానా అబుల్ కలామ్ ను నెహ్రూ విద్యాశాఖ మంత్రిగా చేశారని, విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలామ్ అనేక విధానాలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. హిందూ, ముస్లిం భాయి, భాయి అన్నదే కాంగ్రెస్ విధానం అని చెప్పారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ (Charminar) వద్ద రాహుల్ గాంధీ (Rahul Ghandi) కూడా సద్భావన యాత్ర చేశారని చెప్పారు. మైనారిటీలకు ఈ ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందని నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనారిటీలకు ఇచ్చామని గుర్తు చేశారు. జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని పలువురు ఉపాధ్యాయులు, సామాజిక వేత్తలకు సీఎం అవార్డులు ప్రదానం చేశారు.