‘బండి’కి టికెట్ ఇవ్వొద్దంటున్న సీనియర్లు.. బీజేపీలో ‘పార్లమెంట్’ హీట్!

కరీంనగర్ బీజేపీలో పార్లమెంట్ ఎలక్షన్స్ హీట్ స్టార్ట్ అయింది.

Update: 2023-12-18 05:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ బీజేపీలో పార్లమెంట్ ఎలక్షన్స్ హీట్ స్టార్ట్ అయింది. ఎంపీ బండి సంజయ్ ఈ సారి టికెట్ ఇవ్వొద్దని కొందరు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీఎస్కే తప్ప కరీంనగర్‌లో ఇంకెవరు ఉన్నారని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీనియర్ల సీక్రెట్ సమావేశం..

బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇటీవల సీక్రెట్ గా సమావేశమైనట్లు తెలిసింది. బండి సంజయ్ కు ఈ సారి టికెట్ ఇవ్వొద్దని ఆ మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ వ్యవహారశైలి వల్ల చాలా మంది ప్రచారానికి కూడా రాలేదని ఆరోపించినట్లు తెలిసింది. సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధాని మోడీ పర్యటన సమయంలోనూ సీనియర్లను ఆహ్వానించలేదని, ఆయన ఒంటెద్దు పోకడలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయని వారు చెప్పినట్లు తెలిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని అభిప్రాయపడినట్లు సమాచారం.

తిరుగుబాటు నేతలపై చర్యలకు డిమాండ్

గత ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా గెలిచారని, కరీంనగర్ లో మరో ప్రత్యామ్నాయం ఎవరని బండి సంజయ్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి ఉనికే లేదనుకున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సీక్రెట్ మీటింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి సైతం రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News