జానారెడ్డికి కొత్త టాస్క్
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ స్పెషల్ టాస్క్ అప్పగించింది. అభ్యర్థుల లిస్టు అనంతరం బుజ్జగింపుల బాధ్యతను హైకమాండ్ ఆయనపై ఉంచింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ స్పెషల్ టాస్క్ అప్పగించింది. అభ్యర్థుల లిస్టు అనంతరం బుజ్జగింపుల బాధ్యతను హైకమాండ్ ఆయనపై ఉంచింది. గతంలో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించడంలో జానారెడ్డి సఫలమైనట్లు ఏఐసీసీ బలంగా నమ్ముతుంది. దీంతో కొత్త బాధ్యతలతో ప్రత్యేకంగా ఫోర్ మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాణిక్ రావు థాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఈ కమిటీ క్రియాశీలంగా పనిచేయనున్నది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నోళ్లందరితోనూ ఈ కమిటీ సంప్రదింపులు చేయనున్నది.
సెలక్షన్ బాధ్యత..
రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చితే ఈ సారి అత్యధిక మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యికి పైగా వచ్చిన అప్లికేషన్ల నుంచి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేస్తున్నది. ఇప్పటికే పలు దఫాలుగా మీటింగ్ లు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీకి కత్తి మీద సాములా మారింది. స్క్రీనింగ్ కమిటీ మూడు మీటింగులు జరిగినా ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో టికెట్ల ఎంపిక తర్వాత మిగతా అసంతృప్తులు పార్టీ నుంచి చేజారిపోకుండా జానారెడ్డి కమిటీ బుజ్జగింపులు చేసి భరోసా కల్పించనుంది.
స్థాయిని బట్టి..
టికెట్ రాని నేతలకు స్థాయిని బట్టి భరోసా కల్పించాలని ఫోర్ మెన్ కమిటీ తీర్మానించింది. ఉదాహరణకు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోస్టుల్లో పనిచేసి టికెట్ ఆశిస్తే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఆయా పరిధిలో నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నమ్మకం కల్పించడం. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి లీడర్లకు స్టేట్ కేడర్ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని బుజ్జగించనున్నారు. కర్ణాటక మంత్రి బోసురాజు అంశాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తులను కాంప్రమైజ్ చేయనున్నారు. అయితే స్థానిక సంస్థల్లో పనిచేసిన లీడర్లు కమిటీతో కాంప్రమైజ్ అయినా.. రాష్ట్రస్థాయిలో పేరొందిన నేతలు అంత సులువుగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదనే చర్చ పార్టీలో జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.